సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (16:49 IST)

నంద్యాల బైపోల్ : వైకాపాకు షాక్... శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ తిరస్కృతి!?

నంద్యాల ఉపఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న ఒక పరిణామం వైకాపాను షాక్‌కు గురిచేసింది. ఈ పార్టీ తరపున నంద్యాల ఉపఎన్నికల బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పత్రం చెల్లదంటూ టీడీప

నంద్యాల ఉపఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న ఒక పరిణామం వైకాపాను షాక్‌కు గురిచేసింది. ఈ పార్టీ తరపున నంద్యాల ఉపఎన్నికల బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పత్రం చెల్లదంటూ టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
శిల్పా మోహన్ రెడ్డికి వైకాపా ఇచ్చిన బీఫాంను నోటరీ చేసిన న్యాయవాది రామతులసి రెడ్డి నోటరీ లైసెన్స్ 2013 డిసెంబర్‌తోనే ముగిసిందని చెబుతూ.. దానికి సంబంధించిన లేఖను కూడా కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ నుంచి తీసుకొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్‌కు అందించారు. టీడీపీ ఇచ్చిన లేఖలను ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సంబంధిత నిపుణులతో చర్చిస్తున్నారు.
 
అదేసమయంలో శిల్పా మోహన్‌రెడ్డి తన డమ్మీ అభ్యర్థిగా ఆయన కుమారుడితో నామినేషన్ వేయించారు. అయితే అది కూడా గడువు ముగిసిన నోటరీతో ఉండటంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. 2009లో కదిరి బాబూరావు నామినేషన్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు నామినేషన్‌ను తిరస్కరించారని, ఇప్పుడు కూడా అదే జరగొచ్చని రాజకీయవేత్తలు భావిస్తున్నారు.
 
మరోవైపు... రెండు పార్టీలు పోటాపోటీగా గెలుపు ప్రయత్నాల్లో తలమునకలవడంతో.. విజయం ఎవరిని వర్తిస్తుందా? అన్న ఆసక్తి కొనసాగుతోంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రాయుళ్లు అప్పుడే రంగంలోకి దిగిపోయారు. రాజకీయ విశ్లేషకులకు ఫోన్లు చేసి మరీ.. ఎవరి బలాబలాలేంటో వీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. కొందరైతే నేరుగా జనం వద్దకే వెళ్లి.. ఎవరు గెలుస్తారో చెప్పాలంటూ ఆరా తీస్తున్నారట. నంద్యాల ఉపఎన్నిక ఫీవర్ కు బెట్టింగ్ కూడా తోడవడంతో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరుపై మరింత ఉత్కంఠ నెలకొంది.