1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (15:19 IST)

జగన్ రాక్షస పాలన అంతానికి అన్నదమ్ముల్లా కలిసి పోరాడుదాం : నారా బ్రహ్మణి

jsp leaders - brahmani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సాగుతున్న రాక్షస పాలనను అంతమొందించేందుకు తెలుగుదేశం - జనసేన పార్టీ నేతలు సొంత అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని నారా బ్రహ్మణి అన్నారు. రాజమండ్రి క్యాంపు కార్యాలయంలో ఉంటున్న నారా బ్రాహ్మణిని తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులు కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా బ్రహ్మణి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎవరూ, ఎపుడూ చూడలేదన్నారు. చంద్రబాబు కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని, చంద్రబాబు తప్పు చేసినట్టు ఒక్క ఆధారం కూడా లేదన్నారు. రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి లేదన్నారు. 
 
ముఖ్యంగా, ఈ స్థాయి విద్వేషాలు ఎన్నడూ లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని, గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. టీడీపీ, జనసేన రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటుపై లోకేశ్ - పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాటం చేద్దామని తెలిపారు. పైగా, స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ నేతలకు, తమకు అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు నారా బ్రాహ్మణి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు అరెస్టు అని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని, ఈ రాక్షస పాలన అంతానికి ప్రతి ఒక్కరూ ఉమ్మడి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
కాగా, తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేశ్ నేతృత్వంలో పలువురు ఇంఛార్జ్‌లు, నేతలు బ్రాహ్మణిని కలిసి మద్దతు ప్రకటించారు. మద్దతు తెలిపిన వారిలో ముత్తా శశిధర్, తోట సుధీర్, తుమ్మల రామస్వామి బాబు, పితాని బాలకృష్ణ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, గంటా స్వరూపారాణీ, బత్తుల బలరామకృష్ణ, వాసిరెడ్డి శివ, మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య బాబు తదితరులు ఉన్నారు.