బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (14:38 IST)

తప్పుడు ఆధారాలు తగలబెడితే చేసిన పాపాలు పోతాయా... : నారా లోకేశ్

nara lokesh
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడుపై అక్రమ కేసులు బనాయించిన ఏపీ సీఐడీ పోలీసులు ఇపుడు చేసిన తప్పును తెలుసుకున్నట్టున్నారు. పైగా, వచ్చే ఎన్నికల్లో అధికార వైకాపా ఓడిపోతుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటివరకు వెలువడిన అన్ని సర్వే ఫలితాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై గతంలో అక్రమ కేసులు నమోదు చేశారని, ఆ కేసులకు సంబంధించిన పత్రాలను తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో తగలబెట్టారని టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ విభాగం సోమవారం ఆరోపించింది. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక పత్రాలను తగలబెట్టమని సీఐడీ అధికారి రఘురామిరెడ్డి ఆదేశించారన ఐటీడీపీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసింది. 
 
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "నేర పరిశోధనపై దృష్టిసారించాల్సిన ఏపీ సీఐడీ జగన్ పుణ్యమాని క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని తాము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా మారిపోయారని ఆరోపించారు. 
 
మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్రకు జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని, జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారన్నారు. 
 
ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్‌‍లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.