నాసా డేగ కన్ను... ఢిల్లీలో రైతులు పంట కాలుస్తున్న చిత్రాలు షేర్!
అమెరికాలోని నాసా సంస్థ తన డేగ కళ్ళతో ఎప్పుడూ భారత్ ను గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏ పరిణామాలు జరిగినా, వెంటనే నాసా చిత్రాలు తీసేస్తుంది. దీనిని తాజా ఉదాహరణ ఢిల్లీలోని కాలుష్య కాసారం. దేశ రాజధాని శివారులో రైతులు తమ పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోతుండగా, దీనిని కూడా చిత్రాలు తీసి నాసా షేర్ చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరగడానికి దారితీసిన రైతులు పంట వ్యర్థాలను కాలుస్తున్న చిత్రాలను అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం షేర్ చేసింది. వ్యవసాయ పొలాల్లో గోధుమ పొట్టు కాల్చడానికి రైతులు పెట్టిన మంటలను చిన్న ఎరుపు చుక్కలతో హాట్ స్పాట్‌లుగా నాసా చిత్రంలో చూపించింది. ఇలా పంట పొలంలో దహనం, కాలుష్యానికి కారకమని వివరించింది.
భారత దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అధిక స్థాయిలో వాయు కాలుష్యంతో జనం సతమతమవుతున్నారు. ఈ నెల 11న సుయోమి ఉప గ్రహంలో విజిబుల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ సూట్ ద్వారా ఈ చిత్రాలను తీశామని నాసా తన బ్లాగ్‌లో తెలిపింది. ఉత్తర భారతదేశంలో గోధుమ పంటల మంటల నుంచి వచ్చిన పొగ ఢిల్లీని కప్పివేసింది. ఈ మంటలు ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరగడానికి దోహదపడిందని నాసా పేర్కొంది. ఢిల్లీలో 22 మిలియన్ల మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడ్డారని అంచనా వేసినట్లు నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లోని రీసెర్చ్ అసోసియేషన్ శాస్త్రవేత్త పవన్ గుప్తా చెప్పారు.
సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ రీసెర్చ్ ప్రకారం ఢిల్లీలోని గాలి నాణ్యత శుక్రవారం వరుసగా ఆరవ రోజు కూడా చాలా పేలవమైన కేటగిరీలో కొనసాగుతోంది.అయితే మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురువారం ఏక్యూఐ 362 నుంచి నేడు 332 ఏక్యూఐకి తగ్గింది.ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఈ నెల 21వతేదీ వరకు నిత్యావసర సరుకులను తరలించే ట్రక్కులు మినహా ఇతర లారీలు ప్రవేశించకుండా నిలిపివేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవసరం అయితే, లాక్ డౌన్ విదించేందుకూ సిద్ధం అని ప్రకటించారు.