మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (09:51 IST)

నెల్లూరులో విలయతాండవం చేసిన నివర్ తుఫాను : చెన్నైకు రాకపోకలు బంద్!

తమిళనాడు - పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య తీరం దాటిన నివర్ తుఫాను... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో విలయతాండవం చేసింది. కుంభవృష్టి, భారీ గాలులలతో విరుచుకుపడింది. ఫలితంగా జిల్లా మొత్తం నీటమునిగింది. కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారి సైతం తెగిపోయింది. దీంతో చెన్నైకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 
 
ఈ నివర్ తుఫాను బుధవారం రాత్రి 12 గంటల సమయంలో తీరందాటింది. ఆపై క్రమంగా కదులుతూ ప్రస్తుతం రాయలసీమపై కేంద్రీకృతమై ఉండగా, నెల్లూరు జిల్లాలో కురిసిన అతి భారీ వర్షంతో చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. 
 
ముఖ్యంగా గూడూరు వద్ద కైవల్యా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నెల్లూరు నుంచి కోట క్రాస్ రోడ్డు వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో తమ తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులంతా రోడ్లపైనే నిలిచిపోయారు. భారీ వర్షాల కారణంగా దాదాపు 10 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయిందంటే, నివర్ పరిస్థితి ఎంత బీభత్సంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఇక చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. గంగినేని చెరువు పొంగిపొరలుతుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి, మినీ బోట్ల సాయంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
కాగా, తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడుతూ వచ్చిన నివర్ తుఫాను, ప్రస్తుతం తీవ్ర వాయుగుండం రూపంలో ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత ఇది వాయుగుండంగా, ఆపై సాయంత్రానికి తీవ్ర అల్ప పీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. 
 
తుపాను ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో ఆకాశం పూర్తి మేఘావృతమై ఉంటుందని అన్నారు. 
 
నెల్లూరుకు పొంచివున్న మరో ముప్పు...  
నెల్లూరుకు నైరుతి దిశగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైవుంది. ఇది మరికొన్ని గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం తిరుపతిక 35 కిలోమీర్లు, నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
కాగా, ఇప్పటికే నివర్ తుఫాను ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చేతికొచ్చిన పంట నాశనమైపోయింది. 
 
ఈ పరిస్థితుల్లో నెల్లూరుకు నైరుతి దిశగా మరో వాయుగుండం కొనసాగుతోంది. కొన్ని గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. 
 
దీని ప్రభావంతో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.