బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

సికింద్రాబాద్ పరిధిలో పరుగులు తీయనున్న ప్రైవేట్ రైళ్లు.. రూట్ల వివరాలు...

మరో రెండేళ్ళలో దేశంలో ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 151 రైళ్లకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ రైళ్లలో సికంద్రాబాద్ క్లస్టర్‌లో 11 రైళ్లు నడువనున్నాయి. ముఖ్యంగా తిరుపతి, శ్రీకాకుళం, గుంటూరు, ముంబై, హౌరా, చెన్నై రూట్లలో ప్రైవేటు రైళ్లు నడవనున్నాయి.
 
సికింద్రాబాద్‌ నుంచి శ్రీకాకుళం వయా విశాఖపట్నం, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, గుంటూరు నుంచి కర్నూలు, తిరుపతి నుంచి వారణాసి వయా సికింద్రాబాద్, గుంటూరు నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్‌ నుంచి ముంబై, ముంబై నుంచి ఔరంగాబాద్‌, విశాఖపట్టణం నుంచి విజయవాడ, విశాఖపట్టణం నుంచి బెంగళూరు వయా రేణిగుంట, హౌరా నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్‌ నుంచి పాండిచ్చేరి వయా చెన్నై రూట్లున్నాయి.
 
ఈ ప్రైవేటు రైళ్లలో ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సిన చార్జీలను ఆయా సంస్థలే నిర్ణయించనున్నాయి. రైళ్లలోని వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత, రైలు వేగం తదితరాల ఆధారంగా చార్జీల నిర్ణయం ఉంటుంది. 
 
అయితే, అన్ని స్టేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థ రైల్వే శాఖ అధీనంలోనే ఉంటాయి. దీంతో ఆయా సేవలను, విద్యుత్‌ను వినియోగించున్నందుకు ప్రైవేటు సంస్థలు రైల్వే శాఖకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది.
 
ఇకపోతే, ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు టెండర్లను ఆహ్వానించగా, 9 సంస్థలు అర్హత సాధించాయి. వాటిల్లో క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్ లిమిటెడ్, గేట్ ‌వే రైల్‌, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ లిమిటెడ్‌ల కన్సార్షియం, జీఎమ్మార్‌ హైవేస్, ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌బీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌, ఎల్‌ అండ్‌ టీ, మాలెంపాటి పవర్‌, టెక్నో ఇన్ ‌ఫ్రా డెవెలపర్స్‌, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్ వంటి సంస్థలు ఉన్నాయి.