మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:39 IST)

పట్టాలెక్కనున్న క్లోన్ రైళ్లు.. అసలు క్లోనింగ్ రైలు అంటే ఏంటి?

రైల్వే శాఖ సోమవారం నుంచి క్లోనింగ్ రైళ్లను నడుపనుంది. రద్దీగా ఉండే రూట్లలో ఈ సమాంతర రైళ్లు నడుపనుంది. ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చాలన్న ముఖ్యోద్దేశ్యంతో ఈ రైళ్లను నడుపుతోంది.
 
ప్రస్తుతం కొవిడ్‌-19 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈ రైళ్లు నడుస్తున్న మార్గాల్లో రద్దీ, వెయిటింగ్‌ లిస్టు అధికంగా ఉంటోంది. అలాంటి మార్గాలు 20 వరకు ఉన్నట్టు రైల్వే శాఖ గుర్తించింది. ఈ మార్గాల్లో మొత్తం 40 రైళ్లు నడుస్తాయి. ఇవి షెడ్యూల్‌ ప్రకారం నడిచే రైళ్లకు క్లోనింగ్‌గా ఉంటూ.. వాటికంటే రెండు లేదా మూడు గంటల ముందే గమ్యస్థానాన్ని చేరుతాయి. 
 
వీటిలో ఎక్కువ రైళ్లను ఢిల్లీ నుంచి బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకలకు నడుపుతుండగా.. సికింద్రాబాద్‌ - ధనపూర్‌ మధ్య ఒకరైలు.. బెంగళూరు - ధనపూర్‌ రైలు తెలంగాణ వాసులకు సేవలందించనున్నాయి. వీటిలో టికెట్‌ ధరలు కూడా హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మాదిరిగానే ఉంటాయని అధికారులు తెలిపారు. వీటిలో అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సమయాన్ని 10 రోజులుగా నిర్ణయించారు.
 
అయితే, అసలు క్లోనింగ్ రైలు అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా షెడ్యూల్‌ ప్రకారం నడిచే రైలుకు ప్రతిరూపంలాంటిది (సమాంతర రైలు). అంటే.. ఒక స్టేషన్‌ నుంచి ఒక రైలు ఉదయం 10 గంటలకు బయలుదేరాల్సి ఉంటే.. అందులో వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ప్రయాణికుల కోసం నడిపే రైలునే క్లోనింగ్ రైలు ఉంటారు. వెయిట్ లిస్టెడ్ ప్రయాణికులందరినీ క్లోనింగ్‌ రైలుకు మారుస్తారు. 
 
ఈ రైళ్లు నిర్ణీత స్టేషన్‌ నుంచి మూడు గంటల ముందు బయలుదేరుతుంది. ఈ రైలు నిలిపే స్టేషన్లు కూడా పరిమితంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కీలక జంక్షన్లలో కూడా వీటికి స్టాపేజీ ఉండదు. అందుకే.. ఇవి షెడ్యూల్‌ సమయం కంటే.. రెండు నుంచి మూడు గంటల ముందే గమ్యస్థానాన్ని చేరుకుంటాయి.