సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:51 IST)

హైదరాబాద్ - ముంబైల మధ్య బుల్లెట్ రైలు... కేంద్రం గ్రీన్ సిగ్నెల్

దేశంలోని రెండు పెద్ద మహానగరాల మధ్య బుల్లెట్ రైలు రానుంది. ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను తయారు చేయాల్సిందిగా సంబంధింత శాఖ అధికారులను కోరింది.
 
దేశవ్యాప్తంగా ఏడు కొత్త మార్గాలకు సంబంధించి డీపీఆర్ (ప్రాజెక్టు పూర్తి నివేదిక) సిద్ధం చేయాలని హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్)ను కేంద్రం ఆదేశించిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లని పేర్కొన్నారు.
 
కాగా, ఇప్పటికే దేశంలో అహ్మదాబాద్ - ముంబైల మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రం చేపట్టిన విషయం తెల్సిందే. మొత్తం 508.17 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభం కాగా, దీని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. 
 
వాస్తవానికి ఈ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తికావాల్సివుంది. కానీ, భూసేకరణ సంబంధిత సమస్యలు, కరోనా వంటి సమస్యల కారణంగా ఇది అక్టోబరు 2028 నాటికి వాయిదా పడే అవకాశాలున్నట్టు కేంద్ర రైల్వే వర్గాల సమాచారం.