శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (07:35 IST)

రాష్ట్రానికి నూతన అంగన్వనాడీ కేంద్రాలు: రాష్ట్ర మంత్రి తానేటి వనిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఒన్ స్టాప్ కేంద్రాలు,ఉజ్వల, స్వధార్ పధకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల కావాల్సి ఉన్న నిధులను సకాలంలో విడుదల చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి తానేటి వనిత కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానికి విజ్ణప్తి చేశారు.

ఈమేరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ఢిల్లీ నుండి నిర్వహించిన వీడియా సమావేశంలో మంత్రి వనిత పాల్గొని మట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న వైయస్సార్ సంపూర్ణ పోషణ,వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పధకాల గురించి వివరించారు. ఈరెండు పధకాలకు 1863 కోట్ల రూ.లు ఖర్చు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వ వాటాగా 375కోట్ల రూ.లు ఇస్తుండగా మిగతా 1488కోట్ల రూ.లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు.

మహిళా శిశు సంక్షేమానికి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పధకాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకే వైయస్సార్ సంపూర్ణ పోషణ,వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పధకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతోందని మంత్రి తానేటి వనిత కేంద్రమంత్రి స్మృతి ఇరాని దృష్టికి తీసుకవచ్చారు.

రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అంగన్ వాడీ కేంద్రాలను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని మినీ అంగన్ వాడీ కేంద్రాలను  మెయిన్ అంగన్ వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తానేటి వనిత కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.అదే విధంగా రాష్ట్రంలో 154 ఎసిడిపిఓ ఉద్యోగాలకు 25శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు వాటాను కొనసాగించాలని కోరారు.

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఒన్ స్టాప్ కేంద్రాలు, ఉజ్వల,స్వధార్ పధకాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు.అంగన్ వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం కింద ప్రస్తుతం ఇస్తున్న7లక్షల రూ.లను 12లక్షల రూ.లకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.

అదే విధంగా పోషణ్ అభియాన్ పధకం కింద నాన్ ఆపరేషనల్ గా ఉన్న 11వేల 619 మొబైల్ ఫోన్ల రిప్లేస్ మెంట్ కు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకై వేచి చూస్తున్నామని మంత్రి తానేటి వనిత కేంద్ర మంత్రి స్మృతి ఇరాని దృష్టికి తెచ్చారు.
రాష్ట్ర విభజన అనంతరం అదనంగా మరికొన్ని అంగన్ వాడీ కేంద్రాలు రాష్ట్రానికి వచ్చాయని కావున వాటి నిర్వహణకై మరో మూడు నూతన ప్రాజెక్టులను మంజూరు చేయాలని మంత్రి తానేటి వనిత కేంద్రమంత్రి విజ్ణప్తి చేశారు.

అదే విధంగా పోషణ్ అభియాన్ కింద చేనేత సంఘాల నుండి అదనంగా మరిన్ని చీరలు సమకూర్చాల్సి ఉందని వాటికి ప్రస్తుతం ఇస్తున్న 400రూ.ల యూనిట్ ధరను 800 రూ.లకు  పెంచి సహాయం అందించాలని మంత్రి తానేటి వనిత కేంద్రమంత్రి స్మృతి ఇరానికి విజ్ణప్తి చేశారు.