సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (10:06 IST)

వధూవరులతో పాటు.. క్వారంటైన్‌లో 70 కుటుంబాలు

హాయిగా పెళ్లి చేసుకున్నారు.. కానీ పెళ్లి చేసుకున్న రెండో రోజే వరుడిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. వధువుతో సహా పెళ్లికి హాజరైన వారందరిని క్వారంటైన్‌ చేశారు. ఇందుకు కారణం.. కరోనా పరీక్షా ఫలితాలు రాకముందే వివాహం చేసుకోవడమే. 
 
ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కరోనా టెస్టులకు నమూనాలు ఇచ్చాడు. 
 
వాటి రిపోర్టులు రాకముందే.. వెల్లుర్తి మండలం ఎల్‌.తండాకు చెందిన యువతిని ఈ నెల 10న వివాహాం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన విందులో వరుడు అస్వస్థతకు గురయ్యాడు. ఇదే సమయంలో వరుడికి కరోనా పాజిటివ్‌‌గా ఫలితం వచ్చింది.
 
వెంటనే అప్రమత్తమైన అధికారులు వరుడిని ఐసోలేషన్‌కు తరలించారు. అప్పటికే వరుడు అందరితో కలిసి భోజనం చేసినట్లు గుర్తించడంతో వధువుతో సహా పెళ్లి వేడుకలో పాల్గొన్న అందరిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. మొత్తం 70 కుటుంబాల నుంచి నమూనాలు సేకరించడంతో పాటు గ్రామాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా గుర్తించారు.