బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (15:07 IST)

నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి తరలించాలి : వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారంలో నిమ్మగడ్డను విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు. ఇదే అంశంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుకు నిమ్మగడ్డ ఒక తొత్తు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులపిచ్చితో ఆయన ప్రవర్తిస్తున్నారన్నారు. 
 
మానసికంగా సరిగా లేని వ్యక్తులు రాజ్యాంగ పదవుల్లో ఉండటం ప్రమాదకరమని... ఆయనను మెడికల్ బోర్డుకు రిఫర్ చేయాలని చెప్పారు. పిచ్చాసుపత్రికి పంపించాలని అన్నారు. నిమ్మగడ్డలో చంద్రబాబు ఆత్మ చంద్రముఖిలా ప్రవేశించిందని ఎద్దేవా చేశారు.
 
గరికపాటి, చాగంటి, ఉషశ్రీలకు మించి నీతులు, ధర్మాలు, నిజాయతీల గురించి నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని విజయసాయి అన్నారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనరో లేక టీడీపీ ఎలక్షన్ కమిషనరో అర్థం కావడం లేదని విమర్శించారు. 
 
ఐఏఎస్ అధికారుల పట్ల కూడా ఆయన అనుచితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. గతంలో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైనప్పుడు ఆయన ఎన్నికలకు వెళ్లారని.. ఇప్పడు ప్రభుత్వం వద్దంటుంటే ఆయన ఎన్నికల నిర్వహణకు సిద్ధపడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలను ఆయన తెలియదని విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు.