కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల
కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నారని ఆమె మండిపడ్డారు.
ఇదే అంశంపై ఆమె హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ, కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు, మేనకోడలుగా ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డివంటి వారిని అడ్డం పెట్టుకుని తనపై నిందలు వేశారని విమర్శించారు. జగన్‌కు ఆత్మీయులకంటే ఆస్తులే ముఖ్యమనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో లేదో వైకాపా నేతలు ఆలోచించాలని చెప్పారు.
జగన్ ద్వంద్వ వైఖరి మరోమారి బయటపడిందని షర్మిల అన్నారు. వక్ఫ్ బిల్లులో డబుల్ స్టాండర్డ్ చూపించారని విమర్శించారు. ఎన్డీయేకు బలం ఉన్న లోక్‌సభలో బిల్లును వ్యతిరేకించి, కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేశారని మండిపడ్డారు. జగన్ సూచనలతో రాజ్యసభలో వైకాపా ఎంపీలు బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. జగన్ తీరును జాతీయ మీడియా బట్టబయలు చేస్తుందన్నారు.