ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:38 IST)

అమూల్ తో ఒప్పందం... మిగతా డెయిరీలను దెబ్బకొట్ట‌డానికి కాదు...

పాడి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. అమూల్ పై విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మిగతా డెయిరీలను దెబ్బకొట్టడానికో, మూసేయించేందుకో అమూల్‌తో ఒప్పందం చేసుకోలేదని చెప్పారు.

ప్రభుత్వ ధర చూసి మిగతా సంస్థలు కూడా పాల ధరలు పెంచాయన్నారు. ప్రతి గ్రామ పరిధిలో మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.10వరకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. డెయిరీ వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వెయ్యి పశువులకు ఒక వైద్యుడిని నియమించామన్నారు.


మరోవైపు నాడు-నేడు కింద వెటర్నరీ నిర్మాణాలను ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. పశు సంపద ఆధారంగానే రాష్ట్ర పురోగతిని అంచనా వేస్తారన్నారు. సంగం సంస్థకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానివేనని తెలిపారు. న్యాయపరంగా మరింత ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతుల కష్టాన్ని ఎన్నో ఏళ్లపాటు దోచుకున్నారని మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని పాల సొసైటీని మ్యాక్స్ చట్టం కింద తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేశారన్నారు. పాడి రైతుల అభ్యన్నతికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.