1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (14:48 IST)

"ఛలో విజయవాడ"కు అనుమతి లేదు : పోలీస్ కమిషనర్ టాటా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఉద్యోగులు ఈ నెల మూడో తేదీన ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
ఫిబ్రవరి 3వ తేదీ నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ ప్రదర్శనకు విజయవాడ పోలీసులు అనుమతి నిరాకరించారు. అందువల్ల 3వ తేదీన నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ఎవరికీ అధికారం లేదని ఆయన వెల్లడించారు. 
 
అయితే, ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేందుకు అనుకున్న విధంగా సమ్మెను కొనసాగించాలని ఉద్యోగులు కృతనిశ్చయంతో ఉన్నారు. పీఆర్సీ చెల్లింపు, అదనపు జీతానికి సంబంధించిన మూడు జీఓలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
 
ఇదే అంశంపై మంగళవారం సాయంత్రం మంత్రులు, అధికారులతో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు చర్చలు జరుపగా అవి కూడా విఫలమైన విషయం తెల్సిందే. దీంతో ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల 3న ఛలో విజయవాడ, 7న నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 

ఇందులోభాగంగా, ఫిబ్రవరి 3న విజయవాడలో తమ నిరసన కవాతు నిర్వహించాలని ఉద్యోగులు కృతనిశ్చయంతో ఉండగా, పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. సభను అడ్డుకునేందుకు ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం నుంచి నేతలను గృహనిర్భందంలో ఉంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.