సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (17:27 IST)

అమరావతి రాజ‌ధాని రైతుల మ‌రో విజ‌యం... తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌కు ఓకే!

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల మ‌హాపాద యాత్ర ముగిసింది. నేడు రైతులు తిరుప‌తి వెంక‌న్న ద‌ర్శ‌నం కూడా చేసుకున్నారు. ఇక తిరుపతిలో బహిరంగ సభ పెట్టాల‌న్న రైతుల సంక‌ల్పానికి స్థానిక పోలీసులు అడ్డు త‌గిలారు. బ‌హిరంగ స‌భకు అనుమ‌తి లేద‌ని, లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని నిరాక‌రించారు. కానీ, ప‌ట్టువ‌ద‌ల‌ని రైతులు హైకోర్టుకు వెళ్ళారు. చివ‌రికి హైకోర్టు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
 
 
మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా జేఏసీ బహిరంగ సభకు అనుమతించాలని హైకోర్టును లాయర్లు కోరారు. తిరుపతి రూరల్ పరిధిలో జేఏసీ బహిరంగ సభ నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 6 వరకు సభకు అనుమతించింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదన చేశారు. పైగా, పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారని ఏఏజీ వీడియో ఫుటేజ్ చూపించింది. 
 
 
కానీ, అమ‌రావ‌తి రైతులు ఒక ప్రవేట్ ప్రదేశంలో సభను నిర్వహించుకుంటే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇటీవల కురిసిన భారీ వర్షల కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంశమయ్యాయని, పైగా ఒమిక్రాన్ కేసులు ఉన్న నేపధ్యంలో సభకు అనుమతించలేదని, అడిషనల్ ఏజీ వాదించారు. కానీ, బ‌హిరంగ స‌భ‌కు హైకోర్టు అనుమ‌తించింది. బహిరంగ సభలో ఎలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. 
 
 
నిబంధనలకు లోబడి బహిరంగ సభను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, 
శాంతి భద్రతలకు విఘాతం క‌లించేలా, ప్రభుత్వం అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌వద్దని హైకోర్టు అమ‌రావ‌తి జేఏసీకి తెలిపింది. 
 
 
కాగా, నేడు అలిపిరి పాదాల నుండి బయలుదేరిన అమరావతి రైతుల పాదయాత్ర గోవింద‌ నామ స్మరణలతో 45 వ చివరి రోజు అలిపిరి పాదాల నుండి తిరుమలకు చేరింది. శ్రీవారిని 850 మంది రైతులు దర్శించుకున్నారు. రైతులకు దర్శనాల‌ను టీటీడీ ఏర్పాటు చేసింది.