అమరావతే రాజధాని... సీఎం జగన్ ఇకనైనా కళ్ళు తెరవాలి...
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. దీనికి అనుకూలంగా వ్యూహాలను కూడా రచిస్తోంది. అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఈనెల 14న రౌండ్ టేబుల్ సమావేశాలు, 15న ర్యాలీలు నిర్వహించాలన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా, నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 15న ర్యాలీలు నిర్వహిస్తామని రామకృష్ణ చెప్పారు. 45 రోజులపాటు జరుగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా డిసెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని రాజకీయ పక్షాలను ప్రజా సంఘాలను ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశాలు జరపాలని సంకల్పించారు. డిసెంబర్ 15న అఖిలపక్ష ర్యాలీలు నిర్వహించాలని సీపీఐ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ, 725 రోజులుగా చారిత్రాత్మక ఉద్యమం సాగుతున్నది.సుదీర్ఘంగా అమరావతి ఉద్యమం సాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఉద్యమకారులైన రైతులు, మహిళలపై అక్రమ కేసులు బనాయించడం, ప్రస్తుతం జరుగుతున్న మహా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పించటం పాలకుల నియంతృత్వ వైఖరికి నిదర్శనం. అమరావతినే రాజధానిగా కోరుకుంటూ జరుగుతున్న మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం జగన్ సర్కార్ కు మింగుడు పడటం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండు చేశారు.