మీకు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా?
మీకు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా? అడ్డగోలు నిబంధనలతో ఆదివాసీలకు సంక్షేమ పథకాలు అందకుండా దూరం చేయడం మీకు న్యాయమా? అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ యువనేత లోకష్ బహింగ లేఖ రాశారు.
తలకు మించిన అప్పులతో, సంక్షేమ పథకాలు కోత వేయాలనే ఆలోచనతో, కనీస అధ్యయనం లేకుండా మీరు తెచ్చిన నిబంధనలు వేలాది మంది గిరిజనుల పింఛను, రేషన్‌ని దూరం చేస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. నిరక్షరాస్యులైన ఆ గిరిజనులు తమకి రేషన్ బియ్యం ఎందుకివ్వడం లేదో, పింఛను ఎందుకు ఆపేశారో తెలియక కుంగిపోతున్నారని చెప్పారు. సంక్షేమపథకాలకు కోత వేయాలనే హిడెన్ అజెండాతో, పది ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, వాహనం ఉంటే వారిని సంక్షేమ పథకాలకు అనర్హులని మీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు ఆదివాసీలపాలిట శాపంగా మారాయని లోకేష్ పేర్కొన్నారు.,
రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులోని క్లాజ్ 6 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని విస్మరించి మైదాన ప్రాంతాల లబ్ధిదారుల ఏరివేతకి ఉద్దేశించిన నిబంధనలనే షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకు విధించడంతో వేలాది మంది పింఛను ఆసరా కోల్పోయారని లోకేష్ చెప్పారు.
మైదానప్రాంతంలో 10 ఎకరాలుంటే తక్కువలో తక్కువ కోటి రూపాయలు విలువ చేస్తుందని, అదే ఆదివాసీల పేరుతో ఎన్ని ఎకరాలున్నా 5వ షెడ్యూల్ లోని 1/70 చట్టం ప్రకారం అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదనేది ఆయన గుర్తుచేశారు. అలాగే కొండాకోనల్లో ఉండే ఈ భూముల్లో పండేది ఏమీ ఉండదు. ఏజెన్సీలో ఆదివాసీలకు భూమి పది ఎకరాలకు మించి ఉన్నా, ఎకరం నుంచి 3 ఎకరాలు మాత్రమే సాగులో ఉంటుందని, దీని ద్వారా సంవత్సరానికి గరిష్టంగా వచ్చే ఆదాయం 25 వేల రూపాయలకు మించదని, ఈ సొమ్ముతో ఆదివాసీలు ఎలా జీవనం సాగించాలని లోకేష్ ప్రశ్నించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో ఆదివాసీలందరికీ ఎటువంటి కొర్రీలు వేయకుండా, సంక్షేమ పథకాలు అందించామని, మీరు అధికారంలోకి వచ్చాక 5 ఎకరాలు భూమి ఉన్న గిరిజనులని పథకాలకి అనర్హులుగా ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొంతమంది ఆదివాసీలకు ఎటువంటి భూమి లేకపోయినా, రికార్డుల్లో 10 ఎకరాలు మించి ఉన్నట్టు చూపిస్తూ, సంక్షేమపథకాలు నిలిపేస్తున్నారని ఆరోపించారు. రికార్డుల్లో మీరు చూపించిన భూమి ఆయా ఆదివాసీలకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని లోకేష్ నిలదీశారు.