మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (13:29 IST)

తుగ్లక్ పాలన... రాజ్యాంగంపై ప్రమాణం చేసి...కేంద్ర మంత్రి మురళీ ధరన్

ఏపీ ముఖ్య‌మంత్రిపై కేంద్ర మంత్రి మురళీధరన్ సీరియ‌స్ కామెంట్ చేశారు. ఒక మతాన్ని సీఎం ఎలా ప్రమోట్ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా  కేంద్ర మంత్రి మురళీ ధరన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పాలన సాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి  ఒక మతాన్ని ఎలా ప్రమోట్ చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
 
వైసిపి, టిడిపి ఎంపిలు పార్లమెంట్లో ఎందుకు నిరసన తెలుపుతున్నారో త‌న‌కు అర్ధం కాలేద‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పారు. వైసిపి, టిడిపి పార్లమెంట్ సజావుగా జరగకూడదని గొడవ చేస్తున్నార‌ని, పైగా ఇక్క‌డి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర పధకాల‌ను త‌మ ప‌థ‌కాలుగా చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. నరేంద్ర మోదీ మనీ ఆర్డర్ పంపితే పోస్ట్ మాన్ గా ఉన్నజగన్ మోహన్ రెడ్డి డబ్బులు తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నాడ‌న్నారు. దీనిని తాము బయటపెట్టి ప్రచారం చేస్తామ‌ని బీజేపీ స‌మావేశంలో ప్ర‌క‌టించారు. 

 
గ‌తంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ అవినీతి మార్గంలోనే వెళ్తున్నార‌ని, ఎపిలో ఇసుక, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగింద‌ని చెప్పారు. ఇక ఏపీలో సర్వమత సమ్మేళనం లేద‌ని, ఒకే మతం కోసం ప్రచారం జరుగుతోంద‌ని కేంద్ర మంత్రి మురళీధరన్ ఆరోపించారు. ఈ స‌మావేశంలో ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు, ఇత‌ర నాయ‌కులు ప్ర‌సంగించారు.