1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (13:25 IST)

కేంద్రం పంచాయ‌తీల‌కు ఇచ్చిన నిధులను మీరు దోచుకుంటారా?

గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన నిధులు రూ.1,309 కోట్లు త‌క్ష‌ణ‌మే పంచాయ‌తీ ఖాతాల‌లో జ‌మ చేయాల‌ని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బహిరంగ లేఖ రాశారు. 
 
 
మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచీ మూడింటిపై ఆధారపడి పాల‌న సాగిస్తున్నారు... అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం. ఈ మూడు మార్గాలు అయిపోయాయి. ఇప్పుడు నిధుల మళ్లింపు మీద పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 12,918 పంచాయ‌తీల నుంచి మీ రెండున్న‌రేళ్ల పాల‌న‌లో రూ.1309  కోట్ల‌కు పైగా నిధులు మ‌ళ్లించ‌డంతో కనీసం పంచాయ‌తీ పారిశుధ్య ప‌నుల‌కి కూడా రూపాయి లేని దుస్థితిలో ఉన్నాయి. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ ప‌నుల కోసం గ్రామ పంచాయ‌తీల‌కు కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధుల‌ని దారి దోపిడీదారుల్లా త‌ర‌లించుకుపోవ‌డం దారుణం అని లోకేష్ విమ‌ర్శించారు.
 
 
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయ‌ని, ప‌ల్లెల్లో పారిశుధ్య ప‌రిస్థితి పూర్తిగా దిగ‌జారి, పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వివ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం పంచాయ‌తీల‌కు నేరుగా ఇచ్చిన రూ.1309 కోట్లను పంచాయ‌తీ ఖాతాల నుంచి మళ్లించడం రాజ్యాంగ‌విరుద్ధం అన్నారు. స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యుల‌కు తెలియ‌కుండా, పంచాయ‌తీ బోర్డు తీర్మానం లేకుండా, ఆయా పంచాయ‌తీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ని ప్ర‌భుత్వం మోసం చేయ‌డం కింద‌కే వ‌స్తుంద‌న్నారు. ముందు రోజు పంచాయ‌తీల ఖాతాలో ఉన్న సొమ్ము తెల్లారేస‌రికి మాయ‌మై, జీరో బ్యాలన్స్ చూప‌డం అంటే రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే స‌ర్పంచ్‌లను, పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గాల‌ను వంచించ‌డ‌మ‌ని తెలిపారు.
 
  
సుమారు 4 నెలల క్రితం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 344 కోట్లను విద్యుత్ బకాయిల కింద జ‌మ వేసుకున్నామని, ఇప్పుడు ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించ‌డం బాధ్య‌తారాహిత్యం అని చెప్పారు. 1984 సంవ‌త్స‌రంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు ఎటువంటి ఆదాయంలేని మైనర్ పంచాయతీలకు వీధి దీపాలకు ఉచిత విద్యుత్‌ని అందించ‌గా, దీనిని త‌రువాత వ‌చ్చిన ముఖ్య‌మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వై. యస్. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా  కొనసాగించార‌ని లోకేష్ గుర్తుచేశారు. ద‌శాబ్దాలుగా ఉచిత విద్యుత్ ప్ర‌యోజ‌నం అందుకుంటోన్న పంచాయ‌తీల నుంచి, మీరు పంచాయ‌తీ కార్య‌వ‌ర్గాల‌కు తెలియ‌కుండా రూ. 344 కోట్లు విద్యుత్ పాత‌బ‌కాయిల పేరుతో తీసుకోవ‌డం స‌ర్కారు గూండాగిరీ కింద‌కే వ‌స్తుంద‌న్నారు. మ‌ళ్లించ‌డానికి వీలులేని కేంద్ర‌ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన‌ ఆర్థిక సంఘం నిధులనీ వాడేశారంటే, పూర్తిగా బ‌రితెగించేశార‌ని అర్థం అవుతోంద‌న్నారు.
 
 
 కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధలైన పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్ (ఆర్ఈసీ)కి జెన్‌కో, ట్రాన్స్‌కో బాకీప‌డిన రుణం తీర్చి, మ‌ళ్లీ కొత్త అప్పు కోట్ల రూపాయలు కేంద్ర ఇంధ‌న శాఖ నుంచి తెచ్చేందుకు నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కి, మరీ పంచాయ‌తీల నిధులు తరలించుకుపోవడంపై స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండు చేశారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ‌బ‌ద్ధంగా ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, మైనింగ్ సెస్, వృత్తి పన్ను,  తలసరి గ్రాంట్, నీటి తీరువా పన్ను, ఇసుక, మైనింగ్ పై వ‌చ్చే ఆదాయాలు వేల కోట్లు ఎగ‌వేసి, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాడేయ‌డం చాలా దుర్మార్గ‌మైన చ‌ర్య అన్నారు. 
 
 
మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్య‌మంత్రో, గ్రామానికి స‌ర్పంచ్ కూడా అంతే. అటువంటి స‌ర్పంచుల్ని ఆట బొమ్మ‌ల్ని చేసి, పంచాయ‌తీల నిధులు దారి దోపిడీ దొంగ‌లా ప్ర‌భుత్వ‌మే మాయం చేయ‌డం చాలా అన్యాయం. 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.344 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల నుండి మళ్లించిన రూ.965 కోట్లు త‌క్ష‌ణ‌మే పంచాయ‌తీల ఖాతాల్లో జ‌మ చేయాలి. గ్రామాల‌లో అభివృద్ధికి స‌హ‌క‌రించాలి. పంచాయ‌తీ వ్య‌వ‌స్థ‌ని నిర్వీర్యం చేసే రాజ్యాంగేత‌ర చ‌ర్య‌లు మానుకోవాలి. రాజ‌కీయాధిప‌త్యం కోసం ప్ర‌క‌టించిన ఏక‌గ్రీవాల పారితోషికం పంచాయ‌తీల‌కు విడుద‌ల చేయాలి. ప‌ల్లెల్లో దిగజారిన ప‌రిస్థితులు చక్కదిద్దేందుకు మళ్లించిన నిధులు, ఎగొట్టిన బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చెయ్యాల‌ని నారా లోకేష్ చెప్పారు.