శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:22 IST)

పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఇంటివద్దనే పోషకాహారం: డాక్టర్ కృతికా శుక్లా

కరోనా వ్యాప్తి నేపధ్యంలో పిల్లలు, గర్భిణీలు బాలింతలకు ఇంటి వద్దనే పోషకాహారాన్ని అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్  కృతికా శుక్లా తెలిపారు.

కరోనా నివారణ చర్యల దృష్ట్యా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాలకు అవసరమైన సూచనలు జారీ చేసామన్నారు.

ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ దృష్ట్యా ఐసిడిఎస్ అనుబంధ పోషకాహారం కార్యక్రమంలో భాగంగా 6 నుండి 36 నెలల పిల్లలు,  3 నుండి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలు కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
 
21 రోజుల లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా వీరందరికీ ఇంటి వద్దనే రేషన్ ఇవ్వాల్సినదిగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, సీడీపీఓ లను ఆదేశించామని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.

రెగ్యులర్ అనుబంధ పోషకాహారం కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలకు ప్రతి ఒక్కరికి 1.5 కిలో బియ్యం, 350 గ్రాములు కందిపప్పు, 200ml నూనె, రోజుకి రెండు వంతున 24గుడ్లు, 2 లీటర్లు పాలు, బాల సంజీవని కార్యక్రమం క్రింద 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరికి కిలో బియ్యం, 300 గ్రాములు కందిపప్పు, 100 ml నూనె,

రోజుకి ఒకటి  చొప్పున 12 గుడ్లు, పోషకాహార లోపంతో ఉన్న 6 నుండి 36 నెలల పిల్లలకు 12 గుడ్లు, ఒక లీటర్ పాలు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఒక లీటర్ పాలు, వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం కింద 77 మండలాలలో 6 నుండి 36 నెలల పిల్లలు అందరికీ 14 గుడ్లు, 2.8 లీటర్ల పాలు, 36 నుండి 72 నెలల పిల్లలందరికీ 2.4 లీటర్ల పాలు అందిస్తారన్నారు.
 
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 6 నెలల నుండి 36 నెలల పిల్లలకు రెగ్యులర్ గా ఇచ్చే బాలామృతం, వై ఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలకు ఇచ్చే అదనపు పోషకాహారం వారి అర్హతను బట్టి అందిస్తారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

అయితే కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా ఇంటి వద్ద రేషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు ఆచరించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రభుత్వ పరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు.

రేషన్ పంపిణీ మహిళాసంరక్షణ కార్యదర్శి, ఐసిడిఎస్ సూపర్ వైజర్ పర్యవేక్షణలో జరగాలని, అంగన్ వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందించాలే తప్ప వారిని తమ వద్దకు రావాలని కోరరాదన్నారు.

ఇంట్లో నుండి ఒక్కరు మాత్రమే బయటికి వచ్చి సరుకులు తీసుకునేలా చూడాలని, ఆ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత కీలకమని ఆదేశాలు జారీ చేసామన్నారు. 

అంగన్ వాడీ కార్యకర్తలు రేషన్ ఇచ్చే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవటమే కాక, కార్యకర్త తప్పనిసరిగా ముఖానికి మాస్క్ పెట్టుకుని, సరుకులు వారి పోషణ కొరకు ఇవి ఎలా వాడుకోవాలో వివరించేలా కార్యాచరణ రూపొందించామన్నారు.
 
కుటుంబంలోని 6-72 నెలల పిల్లలు, గర్భిణీ, బాలింతల సంఖ్యను బట్టి పాలు లెక్కగట్టి ఇవ్వటమే కాక,  లబ్ధిదారులు మాత్రమే పాలు వినియోగించేలా హెఛ్చరించాలని, రేషన్ తీసుకున్న లబ్ధిదారుల హాజరు సిఎఎస్ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేసేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సీడీపీఓలు తగు చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు.

లోటు పాట్లకు అవకాశం లేకుండా టేక్ హోమ్ రేషన్ ఎన్ని రోజులకి ఇచ్చారో, అన్ని రోజుల హాజరు ప్రతీ లభ్డిదారునికి సిఎఎస్ లో నమోదు చేయాలని ఆదేశించామన్నారు.

జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు జిల్లా పరిపాలనాధికారితో సమన్వయం చేసుకొని అంగన్ వాడీ కేంద్రాలకు నిర్దేశించిన సరుకులు, గుడ్లు, పాలు తాజావి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని,  జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉన్నందువల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా పరిపాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించామని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.