శుక్రవారం, 15 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఆగస్టు 2025 (22:49 IST)

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

nidhi agarwal
ఇటీవల భీమవరంలో జరిగిన ఈ కమర్షియల్ ఈవెంట్‌కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానని హీరోయిన్ నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ బోర్డు ఉన్న వాహనంలో ఆమె కనిపించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 
 
ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే అధికారులు, నాయకులకు మాత్రమే ఆ వాహనాలను వాడుకునే అవకాశం ఉంటుంది. అధికారులెవరూ తమ సొంత పనుల కోసం వాటిని వాడుకోవడానికి వీల్లేదు. కానీ, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్న వీడియో బయటకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిధి అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.
 
"ఇటీవల భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా జరిగిన పరిణామాలపై సోషల్ మీడియా ప్రచారమవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం రవాణా సదుపాయం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. దానిని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర లేదు. 
 
ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారమైనవి. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నా కోసం ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. నా ప్రియమైన అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ, సహకారం అందిస్తున్న నా అభిమానులకు కృతజ్ఞతలు' అంటూ పేర్కొన్నారు. 
 
ఇక నిధి అగర్వాల్ సినిమాల విషయానికొస్తే, ఇటీవల పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన "హరి హర వీరమల్లు"లో కథానాయికగా నటించి మెప్పించారు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న "ది రాజాసా"బ్‌లోనూ నిధి అగర్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.