సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (14:00 IST)

"ఆపరేషన్ బుడమేరు"ను చేపట్టేందుకు ఏపీ సర్కార్ రెడీ

budameru river
ఆపరేషన్ బుడమేరు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. విజయవాడ నగరంలో బుడమేరు ఆక్రమణల తొలగింపు ప్రయత్నాలు 20ఏళ్ల క్రితమే జరిగాయి. నగరంలోని బుడమేరు కాల్వ గట్లపై ఉన్న ఆక్రమణల తొలగించే ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతోంది. 
 
ఇప్పుడు కూడా బుడమేరుకు ప్రత్యామ్నాయంగా పాముల కాల్వను విస్తరించాలని ప్రతిపాదనలు వచ్చాయి. విజయవాడ వెలుపల ఉన్న పాముల కాల్వ వెంబడి రూరల్ గ్రామాలు విస్తరించాయి. సమీప భవిష్యత్తులో అవి నగరంలో కలిసిపోతాయి. 
 
బుడమేరు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడమే మెరుగైన పరిష్కారంగా కనిపిస్తుంది. ఇందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడానికి ముందుగా ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ , రెవెన్యూ, సర్వే అధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
 
త్వరలో ‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభించి బుడమేరులోని ఆక్రమణలను తొలగిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు ఆక్రమణలకు గురైన భూముల్లో 3051 నిర్మాణాలను జలవనరుల శాఖ గుర్తించిందన్నారు. 
 
వీటిలో అత్యధిక నిర్మాణాలు విజయవాడ నగర పరిధిలోనే ఉన్నాయని వెల్లడించారు. 14, 15, 16 మున్సిపల్ డివిజన్లలో బుడమేరులో ఆక్రమణలు ఉన్నాయన్నారు. బుడమేరు వెలగలేరు, కవులూరు, విద్యాధరపురం, గుణదల, రామవరప్పాడు, ప్రసాదంపాడు మీదుగా కొల్లేరుకు చేరుకుంటుందని, బుడమేరు మొత్తం పొడవు 36.2 కి.మీ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు ఉన్నాయని, అయితే వీటిని ఎక్కువగా వ్యవసాయ అవసరాలకే ఉపయోగిస్తున్నారని మంత్రి వెల్లడించారు. 
 
ఆక్రమణల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎనికేపాడు-కొల్లేరు మధ్య బుడమేరులో ఉన్న తెగుళ్లను పూడ్చి, వరద నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు కట్టలను పటిష్టం చేస్తామన్నారు. బుడమేరు నీటి సత్వర ప్రవాహానికి పాముల కాలువ, ముస్తాబాద్ కెనాల్ వెడల్పు పెంచుతామని రామానాయుడు మీడియాకు తెలిపారు.