శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (06:41 IST)

టీడీపీ నేతను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు

కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. ఇన్నిరోజులుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమనడంతో జిల్లా వాసులు అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేత సుబ్బారావు(45)ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం నాడు మధ్యాహ్నం టీడీపీ నేత సుబ్బారావును కాపుకాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికిచంపారు. 
 
రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు ఒక్కసారిగా ఆయనపైకి తెగబడి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూంగుహాల దగ్గర చోటుచేసుకుంది. సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. ఈయన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిసింది.
 
కాగా.. వ్యాపార లావాదేవీల విషయంలో గత కొన్ని రోజులుగా సుబ్బారావుకు ఆయన ప్రత్యర్థులకు గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ నేతపై ప్రత్యర్థులు దాడికి తెగబడి నరికి చంపారు. ఈ ఘటనతో జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు.