బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఓటుకు రూ.5 వేలు చొప్పున పంపిణీకి వైకాపా ఏర్పాట్లు? - రేషన్ వాహనాల్లో తరలింపు!!

Cash
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపా రానున్న ఎన్నికల్లో ఓడిపోనుందంటూ అనేక జాతీయ మీడియా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, వైకాపా నేతలు మాత్రం మళ్లీ తామే వస్తామంటూ గట్టి నమ్మకంతో ఉంటూ ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ వారు ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు భారీ మొత్తంలో డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ డబ్బును కూడా రేషన్ సరకుల వాహనాల్లో తరలిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. విపక్ష నేతలు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశారు. 
 
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, అధికార పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రావడం కోసం ఓట్ల కొనుగోలుకు ఎండీయూ ఆపరేటర్లను ఎంచుకుంటున్నారు. ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ప్రతి ఓట రునూ గుర్తించి డబ్బులు పంపిణీ చేయడానికి ఇదే సులువైన మార్గంగా వారు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నగరాల్లో ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇప్పటికే డబ్బుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెలలో ప్రతి రేషన్ కార్డుదారునికి ఎండీయూ ఆపరేటర్లు, వారి బంధువుల సహాయంతో రూ.5 వేల చొప్పున పంచేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు సర్వం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ఓట్ల కొనుగోలుకు డబ్బు పంపిణీ కార్యకలాపాలు సాగిస్తున్నారు' అని ఎన్ని కల సంఘానికి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర అధికారులకు లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఈనెల 16వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు అత్యవసర సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై వెంటనే వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, డబ్బు పంపిణీ, బహుమతుల పంపిణీ, రాజకీయ పార్టీ సభ్యుల కరపత్రాల పంపిణీలో ఎండీయూ ఆపరేటర్ల ప్రమేయం ఉండకూడదని స్పష్టంచేశారు. ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.