బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 14 జులై 2021 (19:28 IST)

తిరుమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రత: టిటిడి ఈవో

ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించిన‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమల లోని పిఏసి-4లో గ‌ల కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు.
 
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో భ‌ద్ర‌తా మ‌రియు నిఘా వ్య‌వ‌స్థలు చాల బాగుంద‌న్నారు. కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను శాశ్వ‌త‌ భ‌వ‌నంగా పిఏసి-4లో ఏర్పాటు చేసేందుకు అవ‌స‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ఇజ్రాయ‌ల్ టెక్నాల‌జీతో కూడిన భ‌ద్రాత వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు.

తిరుమ‌ల‌ను నేర ర‌హిత పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు టిటిడి భ‌ద్రాత సిబ్బంది అంకిత భావంతో ప‌నిచేస్తున్నార‌ని అభినందించారు. త్వ‌ర‌లో మ‌రిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాల‌న్నారు. త‌ద్వారా మ‌రింత ప‌టిష్ఠ‌మైన‌ భద్రత వ్య‌వ‌స్థ‌ను తిరుమ‌ల‌లో ఏర్పాటు చేయాల‌ని సివిఎస్వోను కోరారు.  
 
అంత‌కుముందు సివిఎస్వో శ్రీ గోసినాథ్‌జెట్టి మాట్లాడుతూ ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో అన్ని ప్రాంతాల‌లోని 1654 సిసి కెమ‌రాలు ఉన్నాయ‌ని, వీటిలో 1530 సిసిటివిల‌ను కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌కు అనుసంధానించిన‌ట్లు తెలిపారు. ఇందులో ఎక్క‌డ క్రైమ్ జ‌రిగిన వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని మొబైల్ భ‌ద్ర‌తా సిబ్బంది ట్యాబ్‌కు మేసేజ్ వెళ్లుతుంద‌ని, త‌ద్వార త‌క్కువ స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకుని నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు.
 
భ‌క్తుల ర‌ద్ధీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో సిసి కెమ‌రాల ప‌నితీరును, శేషాచ‌ల అడ‌వుల్లోని వ‌న్య‌మృగాల సంచారం, అవి రోడ్ల‌పైకి, జ‌న సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు సిసిటివిలో రికార్డు అయిన వేంట‌నే, అటోమేటిక్‌గా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సైర‌న్‌లు మ్రోగి జంతువులు అడ‌విలోకి వెళ్లిపోయే విధానాని, తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం, వ‌స‌తి మ‌రియు ల‌డ్డూల ద‌ళారుల‌ను, దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డం, త‌ప్పిపోయిన వారి ఆచూకీ క‌నుగొని వారి బంధువుల‌కు అప్ప‌గించుటకు సంబంధించిన‌ వీడియో క్లిపింగ్‌ల‌తో వివ‌రించారు.
 
అనంత‌రం ఈవో విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌త్యేక ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చిన 29 మంది పురుషులు, ఒక మ‌హిళ మొత్తం 30 మంది టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బందిని అభినందించి, న‌గ‌దు బ‌హుమ‌తిని అందించారు. త‌రువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సిసిటివిల‌ ప‌నితీరును కూడా ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు.
 
తిరుమ‌ల‌ న‌డ‌క దారి అభివృద్ధి ప‌నుల‌ ప‌రిశీల‌న:
తిరుమ‌ల న‌డ‌క‌దారిలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం నుండి ఏడ‌వ మైలు వ‌ద్ద ఉన్న శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ర‌కు మెట్ల మార్గంలో ఈవో న‌డిచి వెళ్ళి అక్క‌డ జ‌రుగుతున్న‌ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అభివృద్ధి ప‌నుల‌ను మ‌రింత నాణ్య‌త ప్ర‌మాణాల‌తో, వేగంగా పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా అలిపిరి పాదాల మండ‌పం పైభాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప‌రిశీలించారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ నెలలో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఉన్నందున సెప్టెంబ‌ర్‌ నాటికి  ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
 
అట‌వీ శాఖ ఉద్యాన‌వ‌నాల ప‌రిశీల‌న:
టిటిడి అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో ఏడ‌వ మైలు వ‌ద్ద శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ద్ద ఏర్పాటు చేస్తున్న ఉద్యాన‌వ‌నాల‌ను ఈవో ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్ పెంచుతున్న మొక్క‌ల‌ను గురించి ఈవోకు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఈ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.