బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (14:25 IST)

ఆ కోటరీకి డబ్బే ముఖ్యం... జనసేన వార్డు మెంబర్‌ స్థానాన్ని గెలుచుకోలేదు : పసుపులేటి

పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి రామారావు రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఆయన రాజీనామా చేశారు. 
 
పార్టీకి రాజీనామా చేసిన అనంతరం పసుపులేటి రామారావు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రరావు అనే వ్యక్తిని తణుకు ఇంచార్జ్‌గా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఇంచార్జ్‌గా నియమించడంపై మండిపడ్డారు. 
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక కోటరీ చేరిందని ఆ కోటరీ డబ్బే పరమావధిగా పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. నర్సాపురం పార్లమెంటరీ మీటింగ్‌లో తనను తప్పించి వేరొకరిని ఇంచార్జ్‌గా నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా, జనసేన రెబెల్ అభ్యర్థిగా రామచంద్రరావు పోటీ చేశారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నించానని అయితే కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. 
 
రెండు నెలలుగా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతుంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీ కలవకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ కోటరీ ఇలానే ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఒక వార్డు మెంబర్‌ను కూడా దక్కించుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
అటు పసుపులేటి రామారావు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పీవీఆర్ ఫౌండేషన్ తరపున వివిధ సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అనంతరం జనసేన పార్టీలో చేరి తణుకు నుంచి పోటీ చేశారు. 
 
తణుకు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి 32 వేల ఓట్లు సాధించారు. అంతేకాదు తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు పసుపులేటి రామారావు. ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతుంటే ఒక్కొక్కరూ ఇలా పార్టీ వీడిపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.