మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 31 జులై 2019 (18:13 IST)

పదవి కోసమే జగన్ రోడ్డెక్కారు... నేనలా వస్తే నా అభిమానులు నన్నలా చేస్తారు... పవన్ కల్యాణ్

పార్టీ పెట్టాం.. గెలుస్తామా లేదా అన్నది తెలియదు. కానీ ఒక పార్టీని ఓడించాలని నిర్ణయించుకున్నాం. అది జరిగింది. ఆ పార్టీ ఓడిపోయింది. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడినందుకు టిడిపిని జనం ఓడించారు. ఆ పార్టీ గెలవకూడదనుకున్నా. అదే జరిగింది.
 
అయితే నాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజా సమస్యలే ముఖ్యమని ముందు నుంచి చెబుతున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కూడా మన పార్టీపై నమ్మకంతో ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు. వారి సమస్యలను మన దృష్టికి తీసుకొస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ నిన్న నన్ను వచ్చి కలిశారు. వారి సమస్యపై సిఎంతో పోరాడతానని హామీ ఇచ్చాను అని చెప్పారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... పార్టీని మరింత పటిష్టంగా తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీ అందరిపైనా ఉంది. ఒకప్పుడు నేను పార్టీ పెడితే.. నీ ముఖం చూసి నీకు డబ్బులెవరు ఇస్తారు అని హేళనగా మాట్లాడారు. కానీ నా పార్టీకి, నా పార్టీలో ఉన్న వారికి డబ్బులు అవసరం లేదని మరోసారి నిరూపించుకున్నాం.
 
జగన్ గారికి ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో ప్రజల్లోకి వచ్చారు. రోడ్లపైన తిరిగారు. ఆయన కష్టాన్ని నేను చులకనగా మాట్లాడటంలేదు. జనం మధ్యలో వున్నారు కనుక ఆయనకి సమస్యలు తెలిశాయి. ప్రజలు కూడా నాయకుడు తమ మధ్యనే వున్నాడని ఓట్లు వేశారు. ఐతే నేను కూడా రోడ్లపై తిరిగితే ఎలా వుంటుంది. నా అభిమానులు నా చొక్కాతోపాటు నన్ను కూడా ముక్కముక్కలుగా పీక్కుని వెళతారు. 
 
నేను రోడ్లపైకి వచ్చినప్పుడల్లా నా భద్రతా సిబ్బంది ఫ్యాన్సును అదుపుచేసేందుకు చాలా కష్టపడుతుంది. అలాగని రోడ్లపైకి రాకుండా వుంటానా... రావాల్సిందే. ప్రజల మధ్య తిరగాల్సిందే. తిరుగుతా. ప్రజా సమస్యలు పరిష్కరించేవరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తునే వుంటానంటూ చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్.