సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (11:01 IST)

కరోనా కాలం.. 3 రాజధానులకు ఇది సమయం కాదు.. పవన్ కల్యాణ్

కరోనా కాలం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానుల అంశంపై స్పందించారు. మూడు రాజధానులకు ఇది సమయం కాదని, ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. 
 
గుజరాత్ రాజధాని గాంధీ నగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్‌ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని పవన్ తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. 33 వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ శాసనసభలో గట్టిగా మాట్లాడారని, రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పవన్ చెప్పారు.
 
రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. రైతుల పక్షాల జనసేన చివరివరకూ పోరాడుతుందని పవన్‌ హామీ ఇచ్చారు.
 
ఇకపోతే.. ఏపీలో మూడు రాజధానుల విషయమై శుక్రవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదముద్ర వేశారు. దీంతో.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై అడుగులు వేస్తోంది.