వైకాపా భూదందా కోసమే మూడు రాజధానులు : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైకాపా చెప్పే మూడు రాజధానుల ప్రతిపాదన వారి భూదందా కోసమేనని ఆరోపించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్... గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రాజధాని రైతుల గోడును పవన్ వినిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని.. ఈ విషయాన్ని కేంద్రం తనకు స్పష్టం చేసిందన్నారు.
ఇందులో ప్రధాని, హోం మంత్రి పాత్ర లేదని ఆయన తెలిపారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని జనసేనాని హామీ ఇచ్చారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అవాస్తవ ప్రచారాన్ని జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. భూదందాల కోసమే వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.