గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:42 IST)

లక్ష్మీనరసింహస్వామి సేవలో పవన్ కళ్యాణ్..ఎందుకో?

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అంతర్వేది చేరుకున్న ఆయనకు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి పవన్ కళ్యాణ్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.
 
దిండి నుంచి భారీ ర్యాలీ 
అంతకు ముందు దిండిలోని హరిత రిసార్ట్ నుంచి అంతర్వేది బయలుదేరిన పవన్ కళ్యాణ్ ని వందల సంఖ్యలో బైక్ లతో భారీ ర్యాలీగా కార్యకర్తలు అనుసరించారు.

దిండి గ్రామంలోని దేశనాయకుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి ముందుకి కదిలారు. దారి పొడవునా ఆడపడుచులు హారతులు పట్టి పూలవర్షం కురిపించగా జన సైనికుల జయజయధ్వానాలతో రహదారులు మారుమ్రోగాయి.

దిండి-అంతర్వేది మధ్య రహదారులు పూలదండలతో నిండిపోయాయి. రామరాజు లంక, అప్పనరామునిలంక, టేకిశెట్టివారిపాలెం, సఖినేటిపల్లి, పెదలంక, గొంది మీదుగా పవన్ కళ్యాణ్ అంతర్వేదికి చేరుకున్నారు. దారిపొడుగునా ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో జనసేన అధినేతకు సమర్పించారు.

గ్రామాల్లో రహదారికి ఇరు వైపులా బారులు తీరిన అభిమానులకి అభివాదం చేస్తూ ముందుకి సాగారు. తిరుగు ప్రయాణంలో సైతం రెట్టింపు జన సమూహం పవన్ కళ్యాణ్ ని అనుసరించింది. అంతర్వేది గ్రామం నుంచి బయటకు రావడానికే సుమారు గంటన్నర సమయం పట్టడం గమనార్హం.