1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (16:33 IST)

48 గంటల్లో బాబు స్పందించాలి... లేదంటే ఉద్యమమే... జనసేన పవన్ కళ్యాణ్ వార్నింగ్

ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటలలో స్పందించాలి... లేకుంటే ఉద్యమం తప్పదని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య శ్రీకాకుళం జిల్లాలో నానాటికీ పెరుగుతున్నా ప

ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలపై ప్రభుత్వం 48 గంటలలో స్పందించాలి... లేకుంటే ఉద్యమం తప్పదని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య శ్రీకాకుళం జిల్లాలో నానాటికీ పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, కనీసం కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేయలేకపోవడం గర్హనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. జనసేన ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌.. కిడ్నీ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. 
 
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై  స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్దానం సమస్యపై ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పందించాలని.. సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉద్దానం సహా ఇతర మండలాల్లో కిడ్నీ వ్యాధులకు గురైనవారిని ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణమే ఒక కమిటీని ఏర్పాటుచేసి ఆర్థిక, ఆరోగ్య ప్యాకేజీలు ప్రకటించాలని పవన్‌ కోరారు. తక్షణ సాయంగా కిడ్నీ బాధిత కుటుంబాల్లో అనాథలైన చిన్నారుల బాధ్యతలను ప్రభుత్వాలు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్దానం సమస్య పరిష్కారం కోసం రూ.100 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.  
 
‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్‌ మండిపడ్డారు. డయాలసిస్‌ అనేది చికిత్సకాదన్ని ఇంగితం మంత్రికి లేదా? అని ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధులపై జనసేన ఆధ్వర్యంలో ఐదుగురు డాక్టర్ల కమిటీని ఏర్పాటుచేస్తున్నామని, 15 రోజుల్లోగా ఒక రిపోర్టు తయారు చేయించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. తాము రిపోర్టు ఇచ్చిన 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పవన్  ప్రకటించారు. పుష్కరాల కోసం, రాజధాని నిర్మాణం కోసం కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే నిధులు ఖర్చుపెట్టలేదా అని పవన్ ప్రశ్నించారు. డయాలసిస్ సెంటర్లు పెట్టడం సమస్యకు పరిష్కారం కాదని, తొలుత జబ్బు రావడానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నం చేయాలని అన్నారు.