ప్రత్యేక హోదాపై రాజీపడే హక్కు టీడీపీకి లేదు.. వైకాపా ఎంపీలపై పవన్ ప్రశంసలు.. తెరాసకు థ్యాంక్స్
తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా పట్ల పార్లమెంట్‌లో చేస్తున్న కృషిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ
తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా పట్ల పార్లమెంట్‌లో చేస్తున్న కృషిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్‌తో పవన్ కల్యాణ్ గురువారం వరుసగా ట్వీట్లు చేశారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో వైకాపా ఎంపీలు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారని పవన్ కొనియాడారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన తెలంగాణ ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు గైర్హాజరు కావడంపై పవన్ తప్పుబట్టారు. టీడీపీ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఈ చర్చలో పాల్గొనకుండా మౌనంగా ఉండటం ఎంతో బాధపెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై రాజీపడే హక్కు టీడీపీకి లేదన్నారు. ఏపీ ప్రజల ఓట్లతో టీడీపీ-బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మరిచిపోకూడదని పవన్ గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన సందర్భంగా టీడీపీ ఎంపీలను ఉత్తరాది ఎంపీలు పార్లమెంటులో చితకబాదిన అవమానాన్ని ఆ పార్టీ ఎంపీలు మరిచిపోయినట్లున్నారని పవన్ గుర్తు చేశారు. టీడీపీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టకూడదన్నారు. పాపులర్ డిమాండ్ మేరకు యూపీని ఎందుకు విభజించలేదని పవన్ ప్రశ్నించారు. కేవలం దక్షిణాది రాష్ట్రం ఏపికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందా? అని కేంద్రాన్ని పవన్ అడిగారు. కేంద్ర ప్రభుత్వం విషయంలో టీడీపీ ఓర్పుతో సహనంతో వ్యవహరించడం ఓకే కానీ.. తరచూ అన్యాయాలు ఎదురవుతుంటే.. సహించి ప్రయోజనం ఏమిటని టీడీపీని పవన్ ప్రశ్నించారు.