శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (18:33 IST)

పింఛను డబ్బులతో పాటు.. కరోనాను పంచిన పోస్టుమ్యాన్.. ఎక్కడ?

కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ ఎలా సోకుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఓ పోస్ట్‌మ్యాన్ ఏకంగా వంద మందికి కరోనా వైరస్ అంటించాడు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే.. నెలవారీ పింఛను డబ్బులు పంపణీ చేయడమే. ఈ పింఛను డబ్బులతో పాటు.. కరోనాను కూడా గ్రామ ప్రజలకు పంపాడు. దీంతో ఆ గ్రామ వాసులంతా భయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ సందేహం.. అదెక్కడో కాదు... తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పది రోజుల క్రితం గ్రామస్తులకు పెన్షన్‌ పంపిణీ చేయడం కోసం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ఒక పోస్ట్‌మ్యాన్‌ గ్రామానికి వచ్చాడు. అతని నుంచి పింఛను డబ్బులు అర్హులైన లబ్ధిదారులంతా స్వీకరించారు. అయితే, అప్పటికే పోస్ట్‌మ్యాన్‌ కరోనాతో బాధపడుతూ ఉన్నాడు. ఈ విషయం అతనికి కూడా తెలియదు. దీంతో ఆయనతో కాంటాక్ట్ అయిన దాదాపు వంద మందికి ఈ వైరస్ సోకింది. 
 
ప్రస్తుతం ఈ కేసులు జిల్లా అధికారులకు తలనొప్పిగా మారాయి. పోస్ట్‌మ్యాన్‌ని కలిసిన వారిని గుర్తించి.. ఆ తర్వాత వారు కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలో మెగా టెస్టింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ డ్రైవ్‌‌ను అధికారులు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామస్తులంతా హోమ్‌ క్వారంటైన్‌తో పాటు లాక్డౌన్‌ పాటిస్తున్నారు. బుధవారం నాటికి వనపర్తిలో 21 కంటైన్‌మెంట్‌ జోన్లు గుర్తించారు. వాటి పరిధిలో గత వారం రోజుల్లో 337 కరోనా వైరస్‌ కేసులు నమోదు కావడం గమనార్హం.