శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (10:26 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం - మరణాల్లోనూ రికార్డే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మొత్తం 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడంలేదు. పైగా, ప్రతి రోజూ భారీ సంఖ్యలో టెస్టులు చేయడం వల్లే భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయంటూ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం కొత్త కేసుల నమోదులోనే కాదు... కరోనా మరణాల్లోనూ ఏపీ సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. 
 
జాతీయ సగటును సైతం అధిగమిస్తూ ఏపీలో బుధవారం ఒక్కరోజే 10,093 మంది కొవిడ్‌ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఈ రోజుకు దేశం మొత్తమ్మీద ఇదే అత్యధికం కావడం గమనార్హం. మొన్నటి వరకూ మహారాష్ట్రలో రోజూ పదివేలకు పైగా కేసులు వెలుగు చూడగా, ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ భర్తీ చేసింది. రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 
 
ఈ నెల 24వ తేదీన 8,147 కేసులు రావడమే ఇప్పటి వరకూ అత్యధికంగా ఉంది. ఇదే ఉధృతి కొనసాగితే మరో రెండురోజుల్లోనే ఢిల్లీని దాటి జాతీయ స్థాయిలో ఏపీ మూడోస్థానానికి చేరే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఢిల్లీ, ఏపీ మధ్య కేసుల తేడా 12 వేలు మాత్రమే. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 70,584 మందికి పరీక్షలు నిర్వహించగా 10,093 కేసులు వెలుగులోకి వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌లు 1,20,390కు చేరాయి.
 
ఇకపోతే, కరోనా మరణాలూ కూడా ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో రోజూ కనీసం 50 మందికి పైగా కరోనాతో మృత్యువాత పడుతున్నారు. బుధవారం అత్యధికంగా 65మంది మరణించారు. ఇంతవరకూ రాష్ట్రంలో 24గంటల వ్యవధిలోనే ఇన్ని కొవిడ్‌ మరణాలు నమోదు కాలేదు. 
 
అత్యధికంగా తూర్పుగోదావరిలో 14మంది, అనంతపురంలో 8మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలు, నెల్లూరుల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, కడపల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున మృతిచెందారు.