వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)
ప్రతి ఏటా భారీవర్షాలు పడిన తర్వాత నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతాయట. వాగులో మాత్రమే కాదు... ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా కొన్నయినా వజ్రాలు దొరుకుతాయని అక్కడి ప్రజల గట్టి నమ్మకం. అందుకే... భారీ వర్షాలు ముగిసిన వెంటనే వాగులో వాలిపోయారు అక్కడి ప్రజలు. వజ్రాలు దొరుకుతున్నాయంటూ అందరూ మొల లోతు నీళ్లలో దిగి వాటి కోసం వెతుకుతున్నారు.
ఈ వజ్రాలు కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లోని జొన్నగిరి, తుగ్గలి, మడికెర, పెరవలి మండలాల్లోని వ్యవసాయ భూములను ఆనుకుని వుండే వాగుల్లో దొరుకుతుంటాయని చెబుతారు. భారీ వర్షాలకు భూమి పైపొరలు ప్రవాహానికి కొట్టుకుపోవడంతో వాటి కింద వున్న వజ్రాలు ప్రవాహంతో పాటు ఇలా వాగులోకి చేరుతాయని చెబుతారు.
ఐతే అధికారికంగా ఇప్పటివరకూ ఇక్కడ వజ్రాలు దొరికినట్లు సమాచారం లేదు. ఆగస్టు 2025లో రూ. 18 లక్షల విలువ చేసే వజ్రం దొరికిందంటూ ప్రచారం జరిగింది. ఐతే ఇందులో ఎంత వాస్తవం వున్నదన్నది వెలికి రాలేదు. మొత్తమ్మీద ఇక్కడ దొరికిన వజ్రాలను ప్రజలు రహస్యంగా వ్యాపారులకు అమ్ముకుంటుంటారని చెబుతారు. అందువల్లనే ఇంత భారీఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది.