కానిస్టేబుల్ ఉద్యోగానికి పీహెచ్‌డీ అభ్యర్థి.. ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలు త్వరలో జరుగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తున్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఇండర్మీడియట్ విద్యార్హతతో ఎంపికయ్యే ఈ పోస్టుకు పది మంది హీహెచ్‌డీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగలే, 94 మంది ఎల్ఎల్బీ, 13,961 మంది పోస్ట్ గ్యాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటిసారి పోలీస్ నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నిరుద్యోగుల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారు 31695 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, బీఏ, బీఎస్సీ, బీకామ్ డిగ్రీ గ్రాడ్యుయేట్లు 1,22,991 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22వ తేదీన జరిగే ప్రాథమిక పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టులకు 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ పోలీస్ పోస్టుల్లో 3580 సివిల్, 2520 ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత యేడాది నవంబరు 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు.