1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (14:40 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 'స్థానిక' పోరుకు యాక్షన్ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య వెయ్యిని దాటిపోయింది. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగావుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే దృష్టిసారిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాల్సిన సీఎం జగన్ సర్కారు.. స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైనే అమితాసక్తిని చూపుతోంది. 
 
ఇందులోభాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా ఉన్న (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అడ్డుదారుల్లో తొలగించింది. ఆయన స్థానంలో కొత్తగా మద్రాసు హైకోర్టు మాజీ జడ్డి వి.కనగరాజ్‌ను ఆగమేఘాలపై నియమించింది. ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలంటూ అధికారులను కోరారు. 
 
ఇపుడు మరోమారు.. కరోనా వైరస్‌ వ్యాప్తితో నిమిత్తం లేకుండా, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఇందుకోసం కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా సామాజిక భౌతిక దూరం పాటిస్తూనే, పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచడం, పోలీంగ్ సమయాన్ని పెంచడం వల్ల పోలింగ్ సాఫీగా పూర్తి చేయొచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఇలా చేసినట్టయితే, కోవిడ్19 నిబంధనలు ఉల్లంఘించకుండా పోలింగ్ పూర్త చేయవచ్చని భావిస్తున్నారు. 
 
మరోవైపు, ఏపీ బీజేపీ శాఖ మాత్రం రాష్ట్రంలో ఆర్నెల్ల పాటు ఎలాంటి ఎన్నికలు నిర్వహించరాదని విజ్ఞప్తి చేస్తోంది. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, కేసులు అధికంగా న‌మోద‌వుతున్న జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమ‌ర్జ‌న్సీ ప్ర‌క‌టించాల‌ని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
 
శ‌నివారం ఉద‌యం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని బీజేపీ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంద‌ని ఆరోపించారు. ఏపిలో నాలుగు జిల్లాల్లో 70శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంద‌న్నారు.
 
ఆయా జిల్లాల్లో వెంట‌నే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఓవైపు సామాజిక దూరం పాటించ‌కున్నా కూడా  ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేద‌న్నారు. వైసిపి ఎమ్మెల్యే లు, మంత్రులు లాక్‌డౌన్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడంలేద‌ని విమ‌ర్శించారు.
 
హెల్త్ బులెటిన్‌లో కూడా అనేక లోపాలుంటున్నాసరిదిద్దుకోవడం లేద‌ని వ్యాఖ్యానించారు. కర్నూలులో ఒక‌ వైద్యుడు చనిపోతే.. తొలుత నెగిటివ్ అన్నార‌ని.. తర్వాత పాజిటివ్‌గా నిర్ధారించినా.. అప్పటికే పరిస్థితి మారిపోయింద‌ని తెలిపారు. ప‌విత్రమైన రంజాన్ మాసంలో దాతలు భోజనం పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చార‌ని ఇది సరైంది కాద‌ని  దీనిపై పునరాలోచన చేయాల‌న్నారు.
 
లౌడ్ స్పీకర్‌కు అనుమతి ఇవ్వడం ద్వారా.. అన్ని ప్రాంతాలలో కరోనా జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేయాల‌ని సూచించారు. ఏపి జాలర్లను కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోష‌దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. వైసిపి నేతలు.. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు అనేది గుర్తించాల‌న్నారు. సేవ పేరుతో వందల మందితో ర్యాలీ చేయడం, జన సమూహంతో తిరగడం సరికాద‌న్నారు.
 
జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులను ఆయా జిల్లాలకు పంపించి పరిస్థితి పర్యవేక్షణ చేసేలా చూడాల‌న్నారు. రైతుకు ఎకరాకు రూ.25వేలు సాయం‌ అందించాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. ఇతర రాష్ట్రాలలో పంటలు విక్రయించే బాధ్యత తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కారంలో సిఎం ప్రత్యేకంగా సమీక్ష చేయాల‌ని కోరారు.
 
కరోనా సమయంలో కూడా సిఎం జగన్ ఎన్నికల గురించి ఆలోచన చేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల పాటు ఎన్నికలు ఉండవని ప్రకటన చేయాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం ఎక్కువ.. ఆచరణ తక్కువని పేర్కొన్నారు. కోవిడ్-19 విషయంలో కేంద్రం సూచనలు రాష్ట్రం ఆచరించాల‌ని కోరారు.
 
పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. ల్యాబ్‌ల సంఖ్య పెంచాల‌ని, రాష్ట్రం లో కొన్ని ప్రవేట్ ఆసుపత్రుల్లో అయినా అత్యవసర కేసులు చూసేలా ప్ర‌భుత్వం ఆదేశాలివ్వాల‌ని తెలిపారు. ఎన్నికల కమిషనర్ వివాదం హైకోర్టు పరిశీలనలో ఉంద‌ని, ఈ సమయంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంద‌న్నారు.
 
వైసిపి ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకులు ఇస్తుంద‌న్నారు. ఏపిలో అధికార పార్టీలకు ఒక చట్టం.. విపక్షాలకు మరో చట్టం అన్నట్లుగా ఉంద‌న్నారు. నెహ్రూ యువజన కేంద్రం జాతీయ వైస్ ఛైర్మన్‌గా తాను ఉన్నాన‌ని, అందువ‌ల్లే ఎమర్జెన్సీ కోటా కింద తాను అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్న‌ట్లు చెప్పారు. ఏపిలో తాను అతిధిగా ఉన్నాన‌న్నారు.
 
సామాజిక దూరం పాటించి  పనులు చేస్తున్న‌ట్లు తెలిపారు. కరోనా విధుల్లో పాల్గొంటున్న జర్నలిస్టులకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల‌న్నారు. వైసిపి నేతల నిర్లక్ష్యం వల్లే చాలా ప్రాంతాలలో కరోనా కేసులు పెరగటం వాస్తవం అన్నారు. కారకులైన‌ వారందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.
 
క‌రోనా పాజిటీవ్ కేసులు ప్రభుత్వం ఉద్యోగులు, పోలీసులు, వాలంటీర్‌లకు‌ వచ్చింద‌ని మీడియా వాస్తవాలు చెబితే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌న్నారు. కరోనా వ్యాప్తి చెంద‌కుండా ఇప్పటికైనా ప్ర‌భుత్వం ప‌టిష్ఠమైన చర్యలు చేపట్టాల‌న్నారు. విలేక‌రుల స‌మావేశంలో ప‌లువురు బీజేపీ నేత‌లు పాల్గొన్నారు.