జగన్ ఫోటోకు వలంటీర్ల వంగి వంగి దండాలు.. ఎక్కడ?

village volunteer
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అటు రాజకీయంగానే కాకుండా ఇటు పాలనపరంగా కూడా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ఎన్నో ఆగడాలు, అకృత్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనికికారణం పోలీసులు కూడా వైకాపా నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న గ్రామ వలంటీర్లు సీఎం జగన్ ఫోటోకు వంగివంగి దండాలు పెట్టడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, జై జగన్.. జయహో జగన్.. జోహార్ జగన్ అంటూ నినాదాలు కూడా చేయించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

విజయనగరం జిల్లాలో సీఎం జగన్ ఫొటోకు గ్రామ వలంటీర్లతో వంగివంగి దండాలు పెట్టించారో వైకాపా నేత. అంతేకాదు వారి చేత జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేయించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. జగన్ ఫొటో ముందు గ్రామ వాలంటీర్లు ఒక్కొక్కరిగా వచ్చి తలవంచుతున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు జగన్ ఫొటో ముందు ఇలా సాగిలపడడం దుమారం రేపుతోంది. అసలు దేశంలోని ఎన్నడూ లేని విధంగా ఈ వింత పొకడలు ఏంటని
ఇపుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

సాధారణంగా రాజులకాలంలో నియంతల ముందు బానిసలు, చక్రవర్తుల ముందు సామంతరాజులు వ్యవహరించిన తీరు ఇప్పుడు కనిపిస్తోంది. ఈ వింతపోకడలపై తీవ్రమైన విమర్శలు వెళ్లువెత్తున్నాయి. సహజంగా నమస్కారం పెట్టడం గౌవర సూచికంగా ఉంటుంది. అంతేకాని ఫొటోల దగ్గరకు వెళ్లి.. సాగిల పడటం, తలవంచటం అనే విధానం సంప్రదాయంలో కూడా చాలా హేయమైన చర్యగా పలువురు అభిప్రాయపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :