1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:42 IST)

అమరావతి రైతులకు ఊరట : రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టం...

అమరావతి రైతులకు పెద్ద ఊరట లభించింది. రాజధాని తరలింపు ప్రక్రియను చేపట్టబోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను ఆయన దాఖలు చేశారు. 
 
రాజధాని తరలింపుపై హైకోర్టులో జేఏసీ వేసిన పిల్‌పై విచారణ శుక్రవారం జరిగింది. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. 
 
అయితే రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు పాస్‌ అవ్వకుండా.. రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇదేవిషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రమాణపత్రం దాఖలుకు 10 రోజుల సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో హైకోర్టు 10 రోజుల గడువిచ్చింది. 
 
మరోవైపు, కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. 
 
రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని.. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఏజీని కోరింది.