సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (09:08 IST)

కరోనా హాట్‌ స్పాట్ : ఢిల్లీకి మర్కజ్ - చిత్తూరుకు శ్రీకాళహస్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇపుడు కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీకి ఏ విధంగా అయితే నిజాముద్దీన్ మర్కజ్ మసీదు కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా మారిందో ఇపుడు చిత్తూరు జిల్లాకు శ్రీకాళహస్తి కరోనా కేంద్రంగా మారింది. దీంతో శ్రీకాళహస్తి ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేశారు. 
 
ఈ ప్రాంతంలో కేవలం 80 మంది జనాభా ఉండగా, ఇక్కడ ఏకంగా 50 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా పాజిటివ్ కేసుల్లో 18 మంది ప్రభుత్వ అధికారులో ఉన్నారు. దీనికి కారణం ఢిల్లీ మర్కజ్ మీట్‌కు వెళ్లి వచ్చిన తబ్లీగి జమాత్ వర్కర్లతో పాటు.. లండన్ నుంచి వచ్చిన స్థానికులే కారణమని అధికారులు తేల్చారు. 
 
పైగా, ఇక్కడ లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పలువురు అధికారులకు ఈ వైరస్ సోకింది. వీరిద్వారా పట్టణమంతా వ్యాపించినట్టు గుర్తించారు. అదేసమయంలో ఈ పట్టణంలోకి కరోనా వైరస్ ఎలా ప్రవేశించిందనే విషయాన్ని అధికారులు గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. 
 
దీంతో పట్టణాన్ని పూర్తిగా దిగ్బంధించి.. సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయటకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు ప్రకటించారు.
 
అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం పూట ఉన్న మూడు గంటల వెసులుబాటును కూడా శ్రీకాళహస్తిలో తొలగించాలని నిర్ణయించారు. పెట్రోల్‌ బంకులను పూర్తిగా మూసివేశారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోనే అత్యంత కఠిన నిబంధనలను శ్రీకాళహస్తిలో అమలు చేయాలని నిర్ణయించామని, ఎవరైనా తమ ఆదేశాలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు. 
 
ఈ మేరకు గురువారం రాత్రి రాత్రి పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలతో ర్యాలీ చేస్తూ, నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైకులో ప్రచారం చేశారు. ప్రజలకు ఏవైనా అవసరాలు ఉన్నా, అనారోగ్యం బారినపడినా అధికారులు లేదా గ్రామ వలంటీర్లను సంప్రదించాలేగానీ, ఇళ్ళ నుంచి బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.