శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2020 (22:38 IST)

కరోనావైరస్ మహమ్మారి తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుందో వీళ్లు ముందే ఊహించారు

కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఇప్పుడు అందరం ఇళ్లకే పరిమితమయ్యాం. రేపు ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితిలో మన జీవితాలు గడుస్తున్నాయి. ఈ సమయంలో ఒంటరితనాన్ని, చికాకును దూరం చేసుకునేందుకు చాలా మంది సాహిత్యం చదువుతున్నారు. అయితే, మహమ్మారులకు సంబంధించిన కల్పనలతో ఉన్న సాహిత్యానికి ఇప్పుడు మరింత ఆదరణ పెరిగింది.

 
మహమ్మారి మొదలు కావడం, దాని వల్ల పూర్తి దుర్దశకు చేరడం, ఆ తర్వాత తిరిగి సాధారణ జీవితం నెలకొనడం... ఇలాంటి అంశాలన్నీ స్పృశిస్తూ వాస్తవాలకు దగ్గరగా ఉన్న నవలలు చాలానే ఉన్నాయి. ఇదివరకు మనం ఈ పరిస్థితి ఎదుర్కొన్నామని, దాని నుంచి బయటపడ్డామని అవి మనలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి.

 
డానియెల్ డెఫో 1722లో 'ఎ జర్నల్ ఆఫ్ ద ప్లేగ్ ఇయర్' అనే పుస్తకం రాశారు. బ్రిటన్‌లోని లండన్‌లో 1665లో ప్లేగు వ్యాపించినప్పుడు ఏం జరిగిందో పూస గుచ్చినట్లు అందులో వివరించారు. కరోనావైరస్ వ్యాప్తి, దానిపై మొదట్లో మన స్పందన కూడా అచ్చం ఆ పుస్తకంలో రాసినట్లుగానే ఉంది.

 
1664 సెప్టెంబరులో హాలండ్‌కు ఓ ‘తెగులు’ తిరిగి వచ్చిందన్న వదంతులతో డెఫో పుస్తకం మొదలవుతుంది. ఆ తర్వాత లండన్‌లో ఒక అనుమానాస్పద మృతి నమోదవుతుంది. వసంతంలోకి వచ్చేటప్పటికి స్థానిక చర్చిల్లో మరణాల నోటీసులు పెరిగిపోతాయి. జులైలో లండన్ కొత్త నిబంధనలను తెస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతటా మనం చూస్తున్న లాక్‌డౌన్ నిబంధనల లాంటివే అవి.

 
‘‘జనాల నిర్లక్ష్య వైఖరి కన్నా ప్రాణాంతాకమైంది మరొకటి లేదు. చాలా ముందుగానే హెచ్చరించినా, నిత్యావసరాలు సమకూర్చుకోలేదు. ముందే తెచ్చుకుని పెట్టుకుంటే, వాళ్లు ఇళ్లలోనే ఉండగలిగేవారు. అలా జాగ్రత్తపడి తమను తాము కాపాడుకున్నవారు చాలా తక్కువ’’ అని డెఫో ఆ పుస్తకంలో రాశారు. ఆగస్టు వచ్చేసరికి ప్లేగు విజృంభిస్తుందని, సెప్టెంబర్‌లో పతాక స్థాయికి చేరుకుంటుందని రాశారు.

 
‘‘కుటుంబాలకు కుటుంబాలు, వీధులకు వీధులే తుడిచిపెట్టుకుపోయాయి. కానీ డిసెంబర్ వచ్చేసరికి అంటువ్యాధి సమసిపోయింది. రోగం బారినపడ్డవాళ్లలో చాలా మంది కోలుకున్నారు. నగరం మళ్లీ ఆరోగ్యం సంతరించుకుంది. వీధులు మళ్లీ జనంతో నిండాయి’’ అని డెఫో వర్ణించారు.

 
అల్జీరియాలోని ఓరాన్ నగరం ప్లేగు కారణంగా నెలలపాటు మూతపడటం గురించి అల్బర్ట్ కేమాస్ అనే రచయిత ‘ద ప్లేగ్’ అనే పుస్తకం రాశారు. 19వ శతాబ్దంలో ఓరాన్ ఇలా నిజంగానే మూతపడింది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఆ కథలో వీధుల్లో ఎలుకలు చచ్చిపోయి ప్లేగు సంకేతాలు కనిపిస్తున్నా, స్థానిక నాయకులు సమస్య ఉన్నట్లు అంగీకరించరు.

 
‘మరణం ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. రోగంతో బాధపడుతున్న జనం ఉన్నారు, వాళ్లకు చికిత్స అవసరం అని మాత్రమే నాకు తెలుసు’ అని ప్రధాన పాత్ర బెర్నార్డ్ అంటుంది. చివరికి మహమ్మారి బారి నుంచి బతికి బయటపడ్డ వాళ్లు ‘సాటి మనుషుల పట్ల ప్రేమ’ తప్ప మరేది గొప్పది కాదని ఆ కథలో పాఠం నేర్చుకుంటారు.

 
1918లో వ్యాపించిన స్పానిష్ ఫ్లూ ప్రపంచ గతిని మార్చింది. సుమారు 5 కోట్ల మందిని ఆ మహమ్మారి బలి తీసుకుంది. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినవాళ్లు ఒక కోటి మంది. కానీ, యుద్ధంలోని నాటకీయ ఘటనలు స్పానిష్ ఫ్లూను పెద్దగా కనిపించకుండా చేశాయి. యుద్ధం మీద లెక్కలేనన్ని నవలలు వచ్చాయి. స్పానిష్ ఫ్లూ మీద కూడా కొన్ని వచ్చాయి.

 
లాక్‌డౌన్ కారణంగా మనం ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యాం. సామాజిక దూరం పాటిస్తున్నాం. అలాంటి పరిస్థితులే 1939లో బ్రిటిష్ రచయిత్రి కేథరిన్ ఎన్ పోర్టర్ రాసిన ‘పేల్ హార్స్, పేల్ రైడర్’ అనే నవలలో కనిపిస్తాయి. స్పానిష్ ఫ్లూ గురించి ఆమె ఇందులో వర్ణించారు. నవలలో మిరండా అనే పాత్రకు వ్యాధి సోకినప్పుడు, ఆమె మిత్రుడు ఆడమ్ ‘‘ఇది చాలా గడ్డు కాలం. థియేటర్లు, దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వీధుల్లో రోజంతా శవయాత్రలే కనిపిస్తున్నాయి. రాత్రంతా అంబులెన్స్‌లు తిరుగుతూ ఉన్నాయి’’ అని అంటాడు.

 
మిరండా కొన్ని వారాల పాటు మందుల సాయంతో వ్యాధితో పోరాడుతూ ఉంటుంది. చివరికి కోలుకుని యుద్ధం, ఫ్లూ వల్ల పూర్తిగా మారిపోయిన ప్రపంచంలో ఆమె అడుగుపెడుతుంది. రచయిత్రి పోర్టర్ కూడా స్వయంగా ఫ్లూ బారిన పడి, తిరిగి కోలుకున్న వ్యక్తే. 1963లో ద పారిస్ రివ్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ‘‘నాలో ఓ వింత మార్పు వచ్చింది. తిరిగి జనాలతో కలిసి, సాధారణ జీవితం గడిపేందుకు చాలా సమయం పట్టింది. ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్లు అనిపించేది’’ అని పోర్టర్ చెప్పారు.

 
21వ శతాబ్దంలో వ్యాపించిన సార్స్, మెర్స్, ఎబోలా వైరస్ లాంటివి కూడా ఇలాంటి నవలలకు స్ఫూర్తిని ఇచ్చాయి. ప్లేగు లాంటి వ్యాధుల తర్వాత పరిస్థితులు, నిర్మానుష్య నగరాల గురించి కొందరు కల్పనలు చేశారు. మార్గరెట్ ఎట్వుడ్ 2009లో ‘ద ఇయర్ ఆఫ్ ద ఫ్లడ్’ అనే నవల రాశారు. ఇందులో నీళ్లు లేని వరద ఓ మహమ్మారిలా ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. గాలి ద్వారా వ్యాపిస్తూ నగరాలన్నింటినీ తుడిచిపెడుతుంది. మానవజాతి దాదాపు అంతరించిపోతుంది. కొందరు మాత్రమే దీని నుంచి బయటపడతారు.

 
వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో మార్గరెట్ ఊహించి రాశారు. టోబీ అనే ఓ పాత్ర నిర్మానుష్యంగా ఉన్న ఓ స్పాపైకి చేరి, తనలా బతికి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటుంది. ‘‘ప్రపంచంలో నేను ఒక్కదాన్నే మిగిలానా? ఇంకా ఎవరైనా బతికి ఉన్నారా? ఉంటే, వాళ్లు నాకు స్నేహితులవుతారా? శత్రువులవుతారా?’’ అంటూ ఆమె ఆందోళనపడుతూ ఉంటుంది.

 
రెన్ అనే మరో డ్యాన్సర్ పాత్ర ఈ నవలలో ఉంటుంది. ఆమె తన పేరునే పదే పదే రాసుకుంటూ ఉంటుంది. చాలా రోజులు ఒంటరిగా ఉంటే, తాను ఎవరన్న సంగతి మరిచిపోతానన్నది ఆమె భయం. ఈ నవలలో గతానికి సంబంధించిన కథ కూడా ఉంటుంది. ప్రకృతికి, మనుషులకు మధ్య సమతౌల్యం ఎలా దెబ్బతిందో అందులో మార్గరెట్ వివరిస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు బయో ఇంజినీరింగ్ పేరుతో ప్రకృతిని ఎలా నాశనం చేస్తాయి? టోబీ లాంటి వాళ్లు దానికి వ్యతిరేకంగా ఎలా పోరాడతారో అందులో వర్ణిస్తారు.

 
ఇలాంటి పెనువిపత్తుల అనంతర పరిస్థితులను వర్ణించే కథల్లో పాఠకులను ఆకర్షించే అంశం ఒకటి ఉంది. అదే, మనుషులు ఒకరికొకరు సాయపడటం. ఏకమై సవాళ్లపై పోరాడటం. వారి శత్రువు మనిషి కాదు. మంచికి, చెడుకు పెద్ద తేడా ఉండదు. మనుగడ కోసమే అందరి పోరాటం. ఇవే ఆ కథలను ఆకర్షణీయంగా మార్చుతాయి. చైనా మూలాలున్న అమెరికా రచయిత లింగ్ మా 2018లో ‘సెవెరెన్స్’ అనే నవల రాశారు. ఇందులో అమెరికాలో ఉంటున్న వలసదారుల కథలు కూడా ఉంటాయి.

 
కేడెస్ చెన్ అనే యువతి పాత్ర ఈ నవలలో ఉంటుంది. ఆమె బైబిల్ ముద్రించే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. న్యూయార్క్ నగరంలో ‘షెన్ ఫీవర్’ అనే మహమ్మారి వ్యాపించిన తర్వాత బతికి బయటపడ్డ తొమ్మిది మందిలో ఆమె ఒకరు. నగరం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనమవుతుంది. ఇంటర్నెట్, విద్యుత్ అన్నీ ఆగిపోతాయి. .

 
ఆ తర్వాత కేడెస్, మిగతా వాళ్లతో కలిసి షికాగో సబర్బన్ ప్రాంతం వైపు పయనమవుతుంది. అక్కడ నివాసం ఏర్పరుచుకోవాలని వాళ్లు అనుకుంటారు. వాళ్లు వెళ్లే దారిలో జ్వరం బారిపడ్డవాళ్లు కనిపిస్తూ ఉంటారు. తమకు మాత్రమే రోగం ఎందుకు సోకట్లేదన్నది కేడెస్‌కు అర్థం కాదు. తమ బృంద నాయకుడు బాబ్ పెట్టిన కఠినమైన మతమరమైన నిబంధనలను పాటించడం వల్లే తమకు ఏమీ జరగడం లేదని కేడెస్ తెలుసుకుంటుంది. కానీ, ఆ తర్వాత బాబ్‌కు ఆమె ఎదురు తిరుగుతుంది.

 
లింగ్ మా ఊహించిన పరిస్థితులైతే అదృష్టవశాత్తు ఇప్పుడు మన ముందు లేవు. కానీ, మహమ్మారి పూర్తిగా తన ప్రతాపమంతా చూపి, వెళ్లిన తర్వాత సమాజ నిర్మాణ బాధ్యత ఎవరు తీసుకుంటారన్న అంశాన్ని ఆమె ఈ నవలలో స్పృశించారు. బతికి బయటపడ్డవారిలో అధికారం ఎవరిది? అది ఎవరు నిర్ణయిస్తారు? మత నిబంధనలను పెట్టేదెవరు? ఇలాంటి ప్రశ్నలను ఆమె ఇందులో చర్చించారు. 2014లో ఎమిటీ సెంట్ జాన్ మండ్లే కూడా ఈ తరహాలోనే ‘స్టేషన్ ఎలెవన్’ అనే నవల రాశారు.

 
దాంట్లో జార్జియా అనే గణతంత్ర రాజ్యంలో ఓ భయంకర అంటు వ్యాధి మొదలవుతుంది. అదొక న్యూట్రాన్ బాంబులా పేలి, భూ ఉపరితలమంతా వ్యాపిస్తుంది. ప్రపంచ జనాభాలో 99 శాతం ఈ దెబ్బకు అంతరించిపోతుంది. జనాలకు నాటకాలు, సంగీతంతో వినోదం పంచే బృందం కథ ఇందులో ఉంటుంది.

 
కొత్త ప్రపంచంలో కళ అంటే ఏంటో నిర్ణయించేది ఎవరు? సెలెబ్రిటీలకు ప్రాముఖ్యం ఉంటుందా? వైరస్‌లు మానవాళిపై పైచేయి సాధించినప్పుడు, కొత్త సంస్కృతులు పుట్టుకువస్తాయా? ఆ కొత్త సంస్కృతులు ఎలా ఉంటాయి? అనే విషయాలను ఇందులో ఎమిలీ చర్చించారు. ఈ పుస్తకాలు చదువుకుంటూ, కొత్త ప్రపంచం ఎలా ఉంటుందా అని ఆలోచించినప్పుడు మన మనసులోనూ ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తాయి?