మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్
మెగాస్టార్ చిరంజీవి నటించే కొత్త మూవీలో తనను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు జరుగుతున్న ప్రచారంపై మలయాళ భామ, కథానాయిక మాళవికా మోహనన్ స్పందించారు. అలాంటి అవకాశం వస్తే ఎగిరి గంతేస్తానన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్నది అంతా కేవలం రూమర్స్ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.
'బాబీ దర్శకత్వంలో రానున్న మెగా 158 (వర్కింగ్ టైటిల్)లో నేను నటించనున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవం. నా కెరీర్‌లో ఒక్కసారైనా చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడితో నటించాలని కోరుకుంటున్నాను. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా. కానీ, ఈ ప్రాజెక్ట్‌లో నేను భాగం కాదు' అని స్పష్టతనిచ్చారు. దీంతో ఈ రూమర్స్‌కు తెరపడింది.
కాగా, ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు రూపొందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది విడుదల కానుంది. అలాగే వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర రానుంది. వీటితో పాటు శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో రెండు ప్రాజెక్ట్‌లు లైనప్‌లో ఉన్నాయి. ఇక మాళవిక మోహనన్ ది రాజాసాబ్తో పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.