గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి
ప్రముఖ సముద్ర తీర పర్యాటక ప్రాంతమైన గోవాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నైట్ క్లబ్‌లో చెలరేగిన మంటల్లో 25 మంది అగ్నికి ఆహుతయ్యారు. అనేక మంది గాయపడ్డారు. 'బాలీవుడ్ బ్యాంగర్ నైట్' పేరుతో నిర్వహించిన షోలే సినిమాలోని 'మెహబూబా ఓ మెహబూబా' పాటకు ఓ డ్యాన్సర్ బెల్లీ నృత్యం చేస్తోంది. సంగీత కళాకారులు బ్యాండ్ వాయిస్తుండగా ప్రేక్షకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు.
ఆ సమయంలోనే అకస్మాత్తుగా సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యాయి. దీన్ని సిబ్బంది గమనించినప్పటికీ మొదట అప్రమత్తం అయినట్లు కనిపించలేదు. క్షణాల్లోనే మంటలు పెరగడం, దట్టమైన పొగ అలుముకోవడం కనిపించింది. దీంతో మ్యూజిక్‌ను నిలిపేయడంతోపాటు మంటలు చెలరేగాయి అంటూ అక్కడున్న వారంతా బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ ప్రమాదంపై పోలీసుల జరిపిన ప్రాథమిక దర్యాప్తులో మొదటి అంతస్తులో మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో డ్యాన్స్ ఫ్లోర్‌లో 100 మంది ఉన్నారని.. చిన్న తలుపులు, ఇరుకు మార్గం ఉండడంతో కస్టమర్లు బయటకు రాలేకపోయారని తెలిసింది. కొంతమంది గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న కిచెన్‌లోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఉత్తర గోవాలోని అర్పోరాలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదం పర్యాటక నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదంలో మరణించిన 25 మందిలో నలుగురు పర్యటకులు, 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. మరో ఏడుగురిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఝార్ఖండ్, అస్సాం, తదితర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. గోవా ప్రభుత్వ వైద్య కాలేజీకి మృతదేహాలను ఉంచారు.