సోమవారం, 8 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 డిశెంబరు 2025 (13:46 IST)

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

virat kohli
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆదివారం విశాఖపట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న)ని దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న కోహ్లీకి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కోహ్లీ గర్భాలయంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆ తర్వాత ఆలయంలో విశిష్టత కలిగిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ అధికారులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం అధికారులు కోహ్లీని సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
కాగా, వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు 2-0 తేడాతో గెలుచుకున్న విషయం తెల్సిందే.