Mass Jatara - Bhanu Bhogavarapu
మాస్ జాతర లో మాస్ అంశాలు ఉంటాయి. రైల్వే పోలీస్ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి. మాస్ జాతర అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్ లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నారు అని చిత్ర దర్శకుడు భాను భోగవరపు అన్నారు.
	 
	రవితేజ 75వ చిత్రం మాస్ జాతర. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న చిత్రం కోసం దర్శకుడు భాను భోగవరపు సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
				  
	 
	- ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	-  రవితేజ గారి 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజ గారికి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు.
				  																		
											
									  
	 
	- నవీన్ చంద్ర.. శివుడు అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం మొదట వేరే ఇద్దరు ముగ్గురు నటుల పేర్లు కూడా పరిశీలించాము. కానీ, సంతృప్తి లేదు. అలాంటి సమయంలో నవీన్ చంద్ర గారిని కలిసి కథ వినిపించాను. ఆయనకు కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు. నవీన్ గొప్ప నటుడు, అందులో సందేహం లేదు. అయితే ఈ పాత్రలో ఎలా ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యేక మేకోవర్ చేసి, ఫోటోషూట్ చేయడం జరిగింది. ఆ లుక్ నిర్మాత నాగవంశీ గారితో సహా అందరికీ నచ్చింది. శివుడు పాత్రకు నవీన్ చంద్ర గారు పూర్తి న్యాయం చేశారు. సినిమా విడుదలైన తర్వాత శివుడు పాత్ర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
				  																	
									  
	 
	-  తులసి పాత్ర కోసం వేరే ఏ హీరోయిన్ పేరు మేము అనుకోలేదు. కథ రాస్తున్నప్పుడు నేను, కథ వింటున్నప్పుడు హీరో గారు, నిర్మాతలు మాకు తెలియకుండానే.. హీరోయిన్ శ్రీలీల అని అనుకున్నాం. ధమాకా జోడి కాబట్టి శ్రీలీల ని తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల గారు కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గారు-విజయశాంతి గారి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్ తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ గారు-శ్రీలీల గారి మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి.
				  																	
									  
	 
	- రచయితగా కామెడీలో మంచి ముద్ర వేసినట్లే మాస్ జాతరలో కూడా వినోదానికి పెద్ద పీట వేశా. అదేవిధంగా మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నిజానికి సామజవరగమన లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వాలనుకున్నాను. అయితే ఎక్కువమంది మంచి మాస్ కథ ఉంటే చెప్పు అనేవారు. అలా మాస్ జాతర కథ రాయడం జరిగింది. మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను. రవితేజ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నాను.
				  																	
									  
	 
	- ట్రైలర్ లో రవితేజ  వెంకీ, ఇడియట్ సినిమాల రిఫరెన్స్ లు కనిపించాయి. రవితేజ ఐకానిక్ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రిఫరెన్స్ లు పెట్టడం జరిగింది. అలా అని అవి కథకి అడ్డుగా ఉండవు. అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి.
				  																	
									  
	 
	- భీమ్స్ పేరుని రవితేజ సూచించారు. వారి కాంబినేషన్ లో ధమాకా లాంటి చార్ట్ బస్టర్ వచ్చింది. అందుకే నేను కూడా భీమ్స్ గారు సంగీత దర్శకుడు అయితే బాగుంటుంది అనుకున్నాను. 'తు మేరా లవర్' అంటూ ఆయన స్వరపరిచిన మొదటి గీతమే నాకు ఎంతగానో నచ్చింది.
				  																	
									  
	 
	- యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం రవితేజ ఎంతో కష్టపడ్డారు. ఒకసారి కాలికి, మరోసారి చేతికి గాయాలయ్యాయి. అందుకే చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. అయినప్ప్పటికీ, రవితేజ గారి సహకారం వల్లనే ఈ సినిమాని ఒత్తిడి లేకుండా పూర్తి చేయగలిగాను.
				  																	
									  
	 
	- దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నాగవంశీ ఎంతో మద్దతుగా నిలిచారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు. అలాగే జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడ రాజీపడకుండా ఇంతటి సహకారం అందించడం మామూలు విషయం కాదు.