Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర
మాస్ మహారాజా రవితేజ చిత్రం మాస్ జాతర. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సినిమా విడుదల కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా ఇందులో ప్రతినాయకుడిగా నటించిన నవీన్ చంద్ర ఇలా మాట్లాడారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ.. చాలారోజుల తర్వాత మాస్ జాతర రూపంలో శక్తివంతమైన పాత్ర లభించింది. రవితేజ గారిని అభిమానించే నేను, ఈరోజు ఇలా మాస్ జాతర ఈవెంట్ లో మాట్లాడతానని అసలు ఊహించలేదు. రవితేజ గారు, సూర్య గారు అంటే నాకెంతో అభిమానం. వాళ్ళు ముందు నిల్చొని మాట్లాడటం నాకు డబుల్ ధమాకాలా ఉంది. రవితేజ గారు నా లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మనిషిగా ఎలా ఉండాలి, మనిషిగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేను రవితేజ గారిని చూసి నేర్చుకున్నాను. శివుడు అనే అద్భుతమైన పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు భాను గారికి ధన్యవాదాలు.
అరవింద సమేత'లో బాలరెడ్డి పాత్ర తర్వాత నా కెరీర్ లో గుర్తిండిపోయే పాత్ర ఇది. ఈ పాత్ర ఇంత బాగా రావడానికి కారణం రవితేజ గారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. 'అరవింద సమేత'లో బాలరెడ్డి పాత్రతో నటుడిగా నాకు మరో జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు శివుడు రూపంలో మరో గొప్ప పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా గురించి హృదయపూర్వకంగా ఒక మాట చెప్తాను. ఈసారి జాతర గట్టిగా ఉంటుంది. అక్టోబర్ 31న విడుదలవుతున్న ఈ సినిమా అసలు నిరాశ పరచదు. ముఖ్యంగా రవితేజ గారి అభిమానులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.