Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు
బంగాళాఖాతంలో ఏర్పడి భీకర తుఫానుగా మారిన మొంథా ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ విధించింది ఐఎండీ.
అలాగే వరంగల్, ఖమ్మం, మంచేరియల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావం తీవ్రంగా వుంటుందని, భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు, సరస్సులు పొంగిపొర్లుతాయని చెప్పినా వినకుండా కార్లలో వాగులు దాటేద్దామని, భారీ బండులు నడుపుతూ వాగులు దాటేయడం సులభమని చాలామంది అనుకుంటున్నారు.
హెచ్చరికలు జారీ చేసినా, సూచనలు చేసినా.. పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, జనరం వంతెన సమీపంలోని నిమ్మవాగు వాగులో డీసీఎం వాహనం కొట్టుకుపోయింది.
స్థానికులు డ్రైవర్‌ను నీటిలోకి దిగవద్దని హెచ్చరించడానికి ప్రయత్నించారు కానీ అతను ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం నిమ్మవాగులో డీసీఎం కొట్టుకుపోయింది. ఇంకా డ్రైవర్ గల్లంతయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.