శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:51 IST)

కరోనావైరస్ రోగులకు సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది

వైద్యులు
ఒక నర్సు.. హాంగ్ కాంగ్ నుంచి బ్రిటన్ వచ్చారు. ఒక ఆస్పత్రి పారిశుధ్య కార్మికురాలు నర్సుగా మారారు. రిటైరైన ఒక వైద్యుడు తన మాజీ పేషెంట్లకు సేవలు అందించటం కొనసాగించారు. బ్రిటన్‌లో కరోనావైరస్ కోరల్లో చిక్కుకుని వేలాది మంది చనిపోయారు. వారిలో డాక్టర్లు, నర్సులు, సర్జన్లు, జాతీయ ఆరోగ్య సేవల సిబ్బంది కూడా ఎంతో మంది ఉన్నారు. రిటైర్ అయిన డాక్టర్లు కూడా ఈ అత్యవసర సమయంలో తమ సేవలు అందించటానికి ముందుకొచ్చి ప్రాణత్యాగం చేశారు.

 
అలా చనిపోయిన వారిలో కొంతమంది కథలివి.
మన్‌జీత్ సింగ్ రియాత్, 52
మన్‌జీత్ సింగ్ బ్రిటన్‌లోని తొలి 'యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీ' కన్సల్టెంట్. రాయల్ డెర్బీ హాస్పిటల్‌లో ఆయనను ఎమర్జెన్సీ విభాగానికి తండ్రిగా అభివర్ణిస్తుంటారు. "ఆయన ఎంతో ప్రసన్నంగా ఉండేవారు. అందర్నీ ప్రేమించే వ్యక్తిత్వం" అని హాస్పిటల ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గావిన్ బోయల్ అన్నారు. మన్‌జీత్ 52 ఏళ్ళ వయసులో తాను పని చేసే ఆస్పత్రిలోనే ఏప్రిల్ 21న చనిపోయారు.

 
గారెత్ రాబర్ట్స్
గారెత్ రాబర్ట్స్ 1980ల నుంచి అనేక ఆస్పత్రుల్లో పనిచేశారు. 2014 డిసెంబర్‌లో రిటైర్ అయిన ఆయన 2015 జనవరిలో మళ్లీ విధుల్లోకి వచ్చారు. ‘‘ఆయనకు చాలా మంచి పేరుంది. సరదాగా ఉండేవారు. చాలామంది అభిమానించేవారు’’ అని కార్డిఫ్ అండ్ వేల్ హెల్త్ బోర్డ్ కొనియాడింది. ఆయన అందరికీ సాయం చేసే వ్యక్తి అని సిబ్బంది గుర్తుచేసుకున్నారు. రాబర్ట్స్ మెర్తిర్ టైడ్‌ఫిల్‌లోని ప్రిన్స్ చార్లెస్ ఆస్పత్రిలో చనిపోయారు.

 
జూలీ ఒమర్ (52)
రెడిచ్‌లోని అలెగ్జాండ్రా హాస్పిటల్‌లో 14వ వార్డులో నర్సుగా పనిచేశారు జూలీ ఒమర్. గతంలో వర్సెస్టర్‌షైర్ రాయల్ హాస్పిటల్‌లో కూడా పనిచేశారు. నర్సింగ్ బృందంలో ఎంతో మంది అభిమానించే సభ్యురాలు ఆమె అని హాస్పిటల్ ట్రస్ట్ చెప్పింది. ఆమె అంకితభావంతో పనిచేశారని, ఎంతో అనుభవం ఉన్న నర్సు అని తెలిపింది. ఆమె ఏప్రిల్ 10వ తేదీన తన ఇంట్లో చనిపోయారు. జూలీకి భర్త లేత్, ఎదిగిర కుమార్తె ఉన్నారు.

 
అబ్దుల్ మాబుద్ చౌధురి (53)
ఇద్దరు పిల్లల తండ్రి అబ్దుల్ మాబుద్.. తూర్పు లండన్‌లోని హోమర్టన్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ యురాలజిస్ట్‌గా పనిచేశారు. ఆయన ‘‘కరుణ గల, సానుభూతి గల ఆదర్శనీయుడు’’ అని అబ్దుల్ కుమారుడు ఇంతిజార్ అభివర్ణించారు. ఎన్‌హెచ్ఎస్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కొరత గురించి తన తండ్రి ఎంతో బాధతో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో రాశారని తెలిపారు.
 
బెంగాలీ, ఇంగ్లిష్ సాంస్కృతిక వారసత్వ పండుగలు చేసుకోవటం, పాటలలు పాడటం డాక్టర్ చౌదురికి చాలా ఇష్టమని ఆయన స్నేహితుడు, సహ వైద్యుడు గోలమ్ రాహత్ ఖాన్ చెప్పారు. అబ్దుల్ చౌధురి ఏప్రిల్ 8వ తేదీన చనిపోయారు.

 
డాక్టర్ ఎడ్మండ్ అడిడేజి (62)
విల్ట్‌షైర్‌లోని స్విన్‌డన్‌లో గల గ్రేట్ వెస్ట్రన్ హాస్పిటల్‌ ఎమర్జెన్సీ విభాగంలో లోకమ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు డాక్టర్ ఎడ్మండ్ అడిడేజి. ‘‘ఆయన తను ప్రేమించిన విధులు నిర్వర్తిస్తూ.. తనకన్నా ముందు ఇతరలకు సేవ చేస్తూ చనిపోయారు’’ అని ఆయన కుటుంబం ఒక ప్రకటనలో చెప్పింది. ఆయన ఆస్పత్రి బృందంలో గౌరవనీయుడైన, ఎంతో ఇష్టుడైన సభ్యుడని హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కొనియాడారు. డాక్టర్ అడిడేజి ఏప్రిల్ 8న చనిపోయారు.

 
అలైస్ కిట్ టాక్ ఓంగ్ (70)
అలైస్ తన ఉద్యోగాన్ని చాలా ప్రేమించారని ఆమె కుమార్తె మెలిస్సా చెప్పారు. తన తల్లి 1970లలో హాంగ్ కాంగ్ నుంచి లండన్ వచ్చారని, ఎన్‌హెచ్‌ఎస్‌ను ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా ఆమె భవించటం వల్ల అందులో చేరారని పేర్కొన్నారు.
అలైస్ మిడ్‌వైఫ్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆమె అనారోగ్యానికి గురయ్యే ముందు పూర్తి కాలం పనిచేస్తూ రెండు సర్జరీల్లో పాల్గొన్నారు. శిశువుల క్లినిక్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ఆమె ఏప్రిల్ 7న చనిపోయారు.

 
లీలాని డేరిట్ (47)
సిస్టర్ లీలానీ డేరిట్.. విధుల్లో ఉన్నపుడు కరోనావైరస్ లక్షణాలు కనిపించాయని ఆమె కుమార్తె మేరీ డేరిట్ (19) తెలిపారు. కొన్ని రోజులకు చనిపోయారని చెప్పారు. తన తల్లి చివరి వరకూ కూడా నిస్వార్థంగా పనిచేశారని, తన ఆరోగ్యం కన్నా ఇతరుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారని మేరీ పేర్కొన్నారు. ఆమెకు ఆస్తమా ఉందని, ఏడు రోజుల పాటు స్వయంగా అందరికీ దూరంగా ఉన్నారని.. చివరికి ఏప్రిల్ 7వ తేదీన చనిపోయారని వివరించారు.

 
జానిస్ గ్రాహం (58)
స్కాట్లండ్‌లో కరోనావైరస్ కారణంగా చనిపోయిన తొలి ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది జానిస్ గ్రాహం. ‘‘మా అమ్మ ఏం జరిగినా కూడా నాకు అండగా ఉండేది. ఇప్పుడు ఆమె లేని లోటు నా జీవితాంతం ఉంటుంది’’ అని ఆమె కుమారుడు చెప్పారు.
జిల్లా నర్సుగా పనిచేసిన జానిస్.. ఇన్వర్క్లైడ్ రాయల్ హాస్పిటల్లో ఏప్రిల్ 6న చనిపోయారు.

 
డాక్టర్ సయ్యద్ జిషాన్ హైదర్ (79)
‘‘మా తండ్రి సానుభూతి గల వైద్యుడు. 50 ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేశారు’’ అని డాక్టర్ హైదర్ కుమార్తె సమీనా హైదర్ బీబీసీతో చెప్పారు. తూర్పు లండన్లోని డాగెన్హామ్ వాలాన్స్ మెడికల్ సెంటర్ లో సీనియర్ పార్టనర్ గా పనిచేశారు డాక్టర్ హైదర్. ‘‘ఆయన దయార్ద్రత గురించి ఎంతో మంది వివరించటం చూసి మేం నిర్ఘాంతపోయాం. ఆయన సహచరులు, పేషెంట్లు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికీ గుండెకు హత్తుకునే నివాళులు వస్తూనే ఉన్నాయి’’ అని సమీనా తెలిపారు. డాక్టర్ హైదర్.. రాయల్ లండన్ హాస్పిటల్లో సీనియర్ హోమియోపతిక్ ఫిజీషియన్ గా కూడా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయన ఏప్రిల్ 6న చనిపోయారు.

 
ఐమీ ఓ‘రూర్కీ (39)
‘‘ఓ‘రూర్కీ ఎంతో దయగా సేవ చేసే నర్సు. ఆమెకు తన సహచర సిబ్బందితో పాటు తన సంరక్షణలోని పేషెంట్లతో కూడా ప్రత్యేక అనుబంధం ఉండేది’’ అని ఆమె పని చేసిన అక్యూట్ మెడికల్ యూనిట్ వార్డ్ మేనేజర్ తెలిపారు. ‘‘ఆమె తన కూతర్లను పెంచిన తర్వాత కొంత ఆలస్యంగా ఈ వృత్తిలోకి వచ్చినా చాలా ఇష్టంగా పనిచేశారు’’ అని చెప్పారు.
ఆమె కెంట్‌లోని క్వీన్ ఎలిజబెత్ ద క్వీన్ మదర్ హాస్పిటల్‌లో పనిచేస్తూ ఏప్రిల్ 2న చనిపోయారు.

 
అరీమా నస్రీన్ (36)
నస్రీన్ 2019లో నర్సుగా అర్హత సాధించారు. అప్పటివరకూ ఆస్పత్రిలో క్లీనర్‌గా పనిచేసేవారు. వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని వాల్సాల్ మానర్ హాస్పిటల్‌లో గత 16 ఏళ్లుగా పనిచేసిన నస్రీన్ ఏప్రిల్ 2న అదే ఆస్పత్రిలో చనిపోయారు. ‘‘ఒక అద్భుతమైన నర్సునే కాదు.. ఒక అద్భుతమైన మనిషిని కూడా మేం కోల్పోయాం’’ అని ఆమె సోదరి కజీమా నస్రీన్ చెప్పారు.

 
‘‘నర్సుగా పనిచేయటం ద్వారా చాలా సేవ చేయవచ్చునని నస్రీన్ ఎప్పుడూ భావించేవారు. ఆమె అలాగే పనిచేశారు. ఆమెను కోల్పోవటం చాలా పెద్ద లోటు’’ అని ఆస్పత్రి ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నివాళులర్పించారు.

 
లిన్సే కోవెంట్రీ (54)
లిన్సే తన జీవితంలో కొంత ఆలస్యంగా మిడ్‌వైఫ్ అవ్వాలన్న తన కలను సాకారం చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో చెప్పారు. ‘‘ఎన్నో వందల మంది మహిళలు తమ శిశువులను ప్రపంచంలోకి స్వాగతం పలికేటపుడు లిన్సే వారికి సేవలందించారు. వారందరూ ఆమెను ఎంతో గౌరవించేవారు’’ అని పేర్కొన్నారు. ఎసెక్స్‌లోని హార్లోలో గల ప్రిన్సెస్ అలెగ్జాండ్రియా హాస్పిటల్‌లో పదేళ్ల పాటు పనిచేసిన లిన్సే.. ఏప్రిల్ 2న చనిపోయారు.

 
పూజా శర్మ
ఈస్ట్‌బోర్న్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేసిన పూజా శర్మ.. తమ కుటుంబానికి ఒక సూపర్ స్టార్ అని ఆమె సోదరుడు అభివర్ణించారు. ‘‘ఆమె హాస్యచతురత, మంచితనం మా ప్రపంచాన్ని రంగులమయం చేసేది. పూజ మా సోదరి అని చెప్పటానికి నేను ఎంతో రుణపడి ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు.

 
డాక్టర్ ఫయేజ్ అయేచ్ (76)
డాక్టర్ ఫయేజ్.. చనిపోవటానికి కేవలం నెల రోజుల ముందు పనిచేయటం ఆపేశారు. కానీ ఆయన తన పేషెంట్లకు చికిత్స చేయటానికి వారి ఇళ్లకు వెళుతుండే వారని తాము భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సఫ్లోక్ ఎన్‌హెచ్ఎస్‌లో 40 ఏళ్లకు పైగా పనిచేసిన డాక్టర్ ఫయేజ్.. తరచుగా తన పేషెంట్ల దగ్గరకు వెళ్లి వారు ఎలా ఉన్నారో చూసి వస్తుంటారని ఆయన కుమార్తె లైలా అయాచ్ తెలిపారు. ‘‘ఆయన మనసు ఒక గ్రామీణ వైద్యుడి మనసు’’ అని అభివర్ణించారు.

 
ఆయన తను జన్మించిన సిరియాలో శరణార్థులకు సేవ చేసే సంస్థల కోసం నిధుల సమీకరించారు కూడా. తన తండ్రి జీవితం మొత్తం ఒకవైపు కుటుంబం, మరోవైపు తన వృత్తి కోసమే జీవించారని లైలా పేర్కొన్నారు. ఆయన ఏప్రిల్ 8న చనిపోయారు.

 
జితేంద్ర రాథోడ్ (62)
ఇద్దరు పిల్లల తండ్రి అయిన జితేంద్ర రాథోడ్.. కార్డిఫ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్ వేల్స్‌లో గత 25 ఏళ్లుగా స్పెషలిస్ట్ హార్ట్ సర్జన్‌గా పనిచేశారు. ఆయన అందరూ ప్రేమించే గొప్ప సర్జన్ అని.. ఆయన లేని లోటు తీర్చలేదని బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. రాథోడ్ ఏప్రిల్ 6న ఇదే ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ వార్డులో చనిపోయారు.

 
రెబెకా మాక్ (29)
న్యూకాజిల్‌ రాయల్ విక్టోరియా ఇన్‌ఫర్మరీలోని చిన్నారుల క్యాన్సర్ యూనిట్‌లో నర్సుగా పనిచేసిన రెబెకా మాక్.. ఆ తర్వాత ఇతర విభాగాల్లోనూ పనిచేశారు. ‘‘ఆమె ఒక అద్భుతమైన నర్సు. సంపూర్ణమైన వ్యక్తి. స్నేహానికి ఎంతో విలువనిస్తారు’’ అని ఆమె స్నేహితులొకరు ఒక ఫేస్‌బుక్ పోస్టులో కొనియాడారు. రెబెకా అనారోగ్యానికి గురైనపుడు రోగులతో నేరుగా కాంటాక్ట్‌లో లేరని భావించారు. ఆమె ఏప్రిల్ 5న చనిపోయారు.

 
గ్లెన్ కోర్బిన్ (59)
ఈశాన్య లండన్‌లోని పార్క్ రాయల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్‌లో హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా పాతికేళ్లకు పైగా పనిచేశారు గ్లెన్ కోర్బిన్. ‘‘వార్డులో ఏ పని సజావుగా జరగాలన్నే ఆయనే కీలకం. అన్ని విషయాలూ ఆయనకు కూలంకషంగా తెలుసు. ఆయన మా బృందానికి వెన్నెముక’’ అని స్థానిక ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ అధిపతి క్లారీ మర్దోక్ చెప్పారు. గ్లెన్ కోర్బిన్ ఏప్రిల్ 4న చనిపోయారు.

 
డాక్టర్ ఆంటోన్ సెబాస్టియన్‌ పిళ్లై
పలు రచనలు ప్రచురించిన చరిత్రకారుడు డాక్టర్ సెబాస్టియన్ పిళ్లై శ్రీలంకలోని ఒక మెడికల్ స్కూల్‌లో శిక్షణ పొందారు. వయోవృద్ధులకు చికిత్స చేయటంలో లండన్‌లోని కింగ్స్టన్ హాస్పిటల్‌లో ప్రత్యేక పట్టా పొందారు. ఒక రచయితగా, ఒక వైద్యుడిగా ఎంతో గౌరవనీయుడైన వ్యక్తి ఆయనని లిబ్ డెమ్ లీడర్ ఎడ్ చెప్పారు. ఆయన రాసిన ‘ఎ కంప్లీట్ ఇలస్ట్రేటెడ్ హిస్టరీ ఆఫ్ శ్రీలంక’ పుస్తకం అంతర్జాతీయ ప్రమాణాలు గల పుస్తకమని అభివర్ణించారు. ఏడు పదుల వయసు దాటిన డాక్టర్ సెబాస్టియన్ పిళ్లై ఏప్రిల్ 4న చనిపోయారు.

 
లిజ్ గ్లానిస్టర్ (68)
లిజ్ గ్లానిస్టర్.. లివర్‌పూల్‌లోని ఎయిన్‌ట్రీ యూనివర్సిటీ హాస్పిటల్‌లో సుదీర్ఘ కాలంగా పనిచేశారు. ‘‘ఎంతో మంది జీవితాల్లో లిజ్ పాత్ర ఉంది.. అందుకు మేం గర్విస్తున్నాం’’ అని ఆమె కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏ సమయంలోనైనా ఆప్తులను కోల్పోవటం గుండెను బద్దలు చేస్తుంది. కానీ మేము, మరెన్నో కుటుంబాలు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవటం మాటల్లో చెప్పలేనంతటి బాధాకరం’’ అని అభివర్ణించింది. లిజ్ గ్లానిస్టర్ ఏప్రిల్ 3న రాయల్ లివర్‌పూల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో చనిపోయారు.

 
ప్రొఫెసర్ సామి షోషా (79)
ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో హిస్టోపాథాలజీ విభాగంలో గౌరవ ప్రొఫెసర్ సామి షోషా. 1978 నుండి లండన్ హామర్‌స్మిత్ అండ్ చారింగ్ క్రాస్ హాస్పిటల్స్‌లోని యూకే క్యాన్సర్ రీసెర్చ్ లేబరేటరీల్లో పనిచేశారు. ఆయన ఏప్రిల్ 2న చనిపోయారు.

 
డాక్టర్ అల్ఫా సాడు (68)
‘‘లివింగ్ లెజెండ్’’ అని పిలుచుకునే డాక్టర్ అల్ఫా సాడు.. రిటైర్ అయిన తర్వాత మళ్లీ విధుల్లోకి వచ్చారు. మార్చి 31న ఆస్పత్రిలో చనిపోయారు. డాక్టర్ అల్ఫాకు కరోనావైరస్ సోకక ముందు.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని వెల్విన్‌లో గల క్వీన్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్‌లో ఆయన పార్ట్-టైమ్‌గా పనిచేస్తున్నారని ఆయన కుటుంబం తెలిపింది. ఆయనను ఆస్పత్రికి వెళ్లాలని తాము సూచించినపుడు.. ఆస్పత్రిలో ఒక బెడ్ తన కన్నా ఇతరులకు ఎక్కువ అవసరమని చెప్తూ ఆయన నిరాకరించారని డాక్టర్ అల్ఫా కుమారుడు డాని సాడు చెప్పారు.

 
‘‘మనుషుల ప్రాణాలు కాపాడటానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. వైద్య ప్రపంచంలో ప్రజలకు పాఠాలు చెప్పటం ఆయనకు చాలా ఇష్టం. బ్రిటన్‌లో, ఆఫ్రికాలో ఆయన ఆ పని చేశారు’’ అని తెలిపారు.

 
థామస్ హార్వీ (57)
ఏడుగురు పిల్లల తండ్రి థామస్ హార్వీ.. తూర్పు లండన్‌లోని ఇల్‌ఫోర్డ్‌ గుడ్‌మేస్ హాస్పిటల్‌లో హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆయనకు కేవలం గ్లవ్స్, పలుచటి యాప్రాన్ మాత్రమే ఉన్నాయని.. సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించలేకపోయిందని ఆయన కుటుంబం ఎన్‌హెచ్‌ఎస్‌ను విమర్శించింది. కొన్ని రోజులు అనారోగ్యానికి గురైన హార్వీ మార్చి 29న తన ఇంట్లో చనిపోయారు.

 
అమ్‌గెద్ ఎల్-హారాని
యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ డెర్బీ అండ్ బర్టన్‌లలో చెవి, ముక్కు, గొంతు వైద్యుడిగా పనిచేసిన అమ్‌గెద్.. ‘‘అందరినీ ప్రేమించే, అందరూ ఎంతో ప్రేమించే భర్త, కొడుకు, తండ్రి, సోదరుడు, స్నేహితుడు’’ అని ఆయన కుటుంబం అభివర్ణించింది. ఆయన తన జీవితాన్ని తన కుటుంబానికి, తన వృత్తికి అంకితమిచ్చారని చెప్పింది. అంగద్ మార్చి 28న లీసెస్టర్‌లోని గ్లెన్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో చనిపోయారు.

 
డాక్టర్ హబీబ్ జైదీ (76)
డాక్టర్ హబీబ్ ఒక ఆస్పత్రిని తన భార్య డాక్టర్ తలత్ జైదీతో భాగస్వామిగా నిర్వహించేవారు. వారి నలుగురు పిల్లలూ వైద్య వృత్తిలోనే ఉన్నారు. ఆయన మరణం.. ఆయన త్యాగానికి ప్రతిఫలనమని డాక్టర్ హబీబ్ కుమార్తె డాక్టర్ సారా జైదీ అభివర్ణించారు. ఆయన సేవనే వృత్తిగా పరిగణించేవారని చెప్పారు. డాక్టర్ జైదీ ఎసెక్స్‌లోని సౌతెండ్ హాస్పిటల్‌లో మార్చి 25న చనిపోయారు.

 
ఆదిల్ ఎల్ టేలర్ (63)
ప్రముఖ సర్జన్ డాక్టర్ ఎల్ టేలర్.. 11 సంవత్సరాల పాటు ఎన్‌హెచ్‌ఎస్‌లో పనిచేశాక తన స్వదేశమైన సూడాన్ వెళ్లి ఒక ట్రాన్స్‌ప్లాంట్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం 2015లో బ్రిటన్ తిరిగి వచ్చి లోకమ్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. ‘‘ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఎంతో విలువైన జీవితాన్ని బహుమతిగా ఇచ్చారు’’ అని డాక్టర్ ఆదిల్ సహ సర్జన్ అబ్బాస్ ఘాజన్ఫార్ పేర్కొన్నారు. ‘‘ఆయన ఒక అద్భుతమైన సహచరుడు. ఒక గొప్ప మనిషి’’ అని కీర్తించారు. పశ్చిమ లండన్‌లోని వెస్ట్ మిడిలెసెక్స్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో మార్చి 25న ఆదిల్ ఎల్ టేలర్ చనిపోయారు.