బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (18:53 IST)

ఆ సమస్యతోనే దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది : ప్రకాశం ఎస్పీ

ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం రేపిన భువనేశ్వరి అనే దివ్యాంగురాలు సజీవదహనం కేసును పోలీసుల ఛేదించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు... కేసులోని మిస్టరీని బహిర్గతం చేశారు. ఆర్థిక కష్టాల కారణంగానే ఆమె శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్టు పోలీసులు తేల్చారు. 
 
ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే, ఒంగోలు పట్టణంలో భువనేశ్వరి అనే దివ్యాంగురాలు 12వ వార్డు పరిధిలో వలంటీరుగా పనిచేస్తోంది. ఈమె ఇటీవల అనుమానాస్పద స్థితిలో తన మూడు చక్రాల సైకిల్ పై సజీవదహనం కావడం తీవ్ర కలకలం రేపింది. 
 
గత శుక్రవారం వార్డు సచివాలయానికి వెళ్లిన ఆమె పట్టణ శివార్లలోని దశరాజుపల్లి రోడ్డు వద్ద చినవెంకన్న కుంట వద్ద మంటల్లో కాలిపోతూ కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందో, లేక ఎవరైనా హత్య చేసి దహనం చేశారో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. 
 
ఈ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు త్వరగానే ఛేదించారు. వార్డు వలంటీర్ భువనేశ్వరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు.
 
దీనిపై ఎస్పీ మాట్లాడుతూ, ఆర్థికపరమైన సమస్యలతోనే భువనేశ్వరి తనువు చాలించిందని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓలా యాప్ ద్వారా ఆమె తన స్నేహితులతో చెప్పిందని వివరించారు.