సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (14:54 IST)

కువైట్ నుంచి వచ్చిన భార్య.. ఎయిర్‌పోర్టులో మిస్సింగ్.. ఎక్కడ?

ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన భార్య విమానాశ్రయంలో దిగిన తర్వాత కనిపించకుండా పోయింది. తన భార్య ఎంతకీ రాకపోవడంతో ఆమె భర్త ఆందోళనకుగురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మిస్సింగ్ ఘటన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరుకు చెందిన సాలసత్తి దుర్గ (32) ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
ఆమె ఈ నెల 16న కువైట్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కానీ దుర్గ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త సత్యనారాయణ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
గన్నవరం ఎయిర్ పోర్టు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా, విమానం దిగిన తర్వాత టెర్మినల్ నుంచి వెలుపలికి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఎయిర్ పోర్టు బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆమె ఏ వాహనం ఎక్కింది? ఎటు వెళ్లింది? అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.